ప్రైవేట్ స్కూల్ ఫీజు.. 2 ఏళ్లకు 8 శాతం మాత్రమే పెంచాలి..!

ప్రైవేట్ స్కూల్ ఫీజు.. 2 ఏళ్లకు 8 శాతం మాత్రమే పెంచాలి..!

రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దందాకు చెక్ పెట్టేందుకు ఎట్టకేలకు సర్కారు సిద్ధమైంది. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచే ఆనవాయితీకి బ్రేక్ వేస్తూ.. శాస్త్రీయంగా ఫీజులను నిర్ణయించే ప్రక్రియను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 వేల ప్రైవేటు స్కూళ్లలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత మూడేండ్ల ఆదాయ, వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. 

ప్రతి రెండేండ్లకోసారి 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలపై కసరత్తు ముమ్మరమైంది. ఎంఈఓలు, డీఈఓల ఆధారంగా ఏ స్కూళ్లో ఎంత ఫీజు ఉంది? ఏఏ క్లాసులకు ఎంతెంత తీసుకుంటున్నారు?అనే వివరాలను సేకరిస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో దేని ఆధారంగా బేస్ ఫీజులను నిర్ణయించాలనే దానిపై అధికారులు కసరత్తు చేశారు. 

8 శాతం దాటాలంటే అప్పీల్ కెళ్లాల్సిందే..

స్కూల్ లెవల్ ఫీజుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రతి రెండేండ్లకు ఒకసారి 8 శాతం వరకు ఫీజు పెంచుకునే వెసులుబాటును స్కూల్ యాజమాన్యాలకు కల్పించనున్నారు. ఒకవేళ 8 శాతానికి మించి ఫీజు పెంచాలని మేనేజ్మెంట్లు భావిస్తే,  దానికి తగిన ఆధారాలు చూపుతూ డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (డీఎఫ్​ఆర్సీ)కి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, స్కూల్ లెవెల్ కమిటీలో పది మంది ఉంటే ఐదుగురు పేరెంట్స్, ముగ్గురు టీచర్లు ఉండగా, ప్రిన్సిపల్, కరస్పాండెంట్ ఉండటంతో మేనేజ్మెంట్లు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. పేరెంట్స్ సంఖ్యను తగ్గించాలని కోరుతున్నాయి. 

త్వరలో పబ్లిక్ లోకి ఫీజుల డ్రాఫ్ట్ 

ఫీజుల డ్రాఫ్ట్ ను పారదర్శకంగా వెబ్‌‌సైట్‌‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై పేరెంట్స్, స్టూడెంట్లు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను, సూచనలు సేకరించనున్నారు. ఆ తర్వాతే దాన్ని ఫైనల్ చేయాలని సర్కారు డిసైడ్ అయింది. డీఎఫ్​ఆర్సీ నిర్ణయించిన ఫీజుల వివరాలనూ ఏ స్కూల్ ఎంత వసూలు చేయబోతోందనే డేటాను వెబ్ సైట్​ టో పెట్టనున్నారు. 

మరోపక్క ఫీజుల నియంత్రణ పక్కాగా అమలు చేసేందుకు స్టేట్ లెవల్ ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని గానీ, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీని గానీ నియమించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. కాగా, వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఫీజుల నియంత్రణను చేపట్టాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.