హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఇంకా మానసికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకేసారి ఇంత విషమిచ్చి చంపేయండని షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం (జనవరి 10) మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల మంత్రులు, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
బాధ్యతాయుతమైన ఐఏఎస్‌లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఆఫీసర్ల మీద అభియోగాలు కరెక్ట్ కాదన్నారు. ఓ మహిళా ఐఏఎస్‌పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని.. మహిళా ఆఫీసర్లను ఇబ్బందులు పెడుతూ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి తట్టుకుంటా కానీ మహిళా అధికారులపై ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని హెచ్చరించారు.
రేటింగ్‌లు, వ్యూస్ కోసం అవాస్తవాలు వండి వార్చడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని.. అడ్డగోలు రాతలు మంచికాదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయానని.. తప్పుడు ఆరోపణలతో తనను ఇంకా మానసికంగా హింస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను వేధించడం ఇంకా సరిపోదు అనుకుంటే ఒకేసారి నాకింత విషమిచ్చి చంపేయండని హాట్ కామెంట్ చేశారు.
►ALSO READ | హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్ మధ్య ఈ తేదీల్లో మరో పది సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్
తాను మంత్రి అయ్యాక నల్లగొండ జిల్లాలో నలుగురు కలెక్టర్లు ట్రాన్స్ఫర్ అయ్యారని.. ఐఏఎస్‌ల బదిలీ వ్యవహారం సీఎం చూసుకుంటారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందని వివరణ ఇచ్చారు. మహిళా అధికారులపై ఆరోపణలపై ప్రభుత్వం తరపున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానని అన్నారు.
వచ్చే ఏడాది హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లేన్లు చేస్తాం:
వచ్చే ఏడాది హైదరాబాద్-విజయవాడ హైవేను 6 లేన్లు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నేషనల్ హైవే 65 విస్తరణ కోసం రూ.10,400 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. జాతీయ రహదారులపై వాహనాల రద్దీని మానిటరింగ్ చేస్తున్నామని.. టోల్ ఫ్లాజాల దగ్గర ట్రాఫిక్ ఆగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైవేలపై 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. సంక్రాంతి పండక్కి జనం సొంతూర్లకు వెళ్తుండటంతో పంతంగి టోల్ గేట్ దగ్గర వాహనాలు స్లోగా వెళ్తున్నాయన్నారు. తార్నాక వైపు ఉండే వారు వలిగొండ నుంచి వెళ్లొచ్చని సూచించారు. 10-12 లక్షల వాహనాలు టోల్ గేట్స్ దాటుతున్నాయన్నారు.
