NZ vs SL: శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. సెమీస్ రేసు నుంచి లంక ఔట్

NZ vs SL: శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. సెమీస్ రేసు నుంచి లంక ఔట్

NZ vs SL: టీ20 వరల్డ్ కప్ 2026లో శ్రీలంక సెమీ ఫైనల్ ఆశలపై  న్యూజిలాండ్ జట్టు నీళ్లు చల్లింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన సూపర్-8 కీలక మ్యాచ్‌లో కివీస్ 61 పరుగుల తేడాతో లంకను ఓడించింది. ఈ ఓటమితో శ్రీలంక టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ‘డూ ఆర్ డై’గా మారింది. ఓడిన టీం సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ కీలక పోరులో కివీస్ టీమ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే బిగ్ షాక్స్ తగిలాయి. తొలి బంతికే ఇన్‌ఫామ్ ఓపెనర్ పథుమ్ నిస్సంక ఔట్ కావడంతో లంక జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది.

రెండో ఇన్సింగ్స్ మొత్తం శ్రీలంక ఆటగాళ్లు ఒత్తిడికి గురి కావడంతో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ దాడికి తట్టుకోలేక 20 ఓవర్లలో కేవలం 107 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో శ్రీలంక 61 పరుగుల భారీ తేడతో ఓడిపోయింది. ఇది సూపర్-8 దశలో శ్రీలంకకు వరుసగా రెండో ఓటమి.. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమితో ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేకుండానే ఉంది. ఫలితంగా గ్రూప్-2 నుంచి టాప్-2లో నిలవడం శ్రీలంకకు అసాధ్యంగా మారింది. పాకిస్తాన్‌తో చివరి మ్యాచ్ గెలిచినా శనక సేనకు కేవలం రెండు పాయింట్లే వస్తాయి.. దీంతో సెమీస్ కి చేరే అవకాశం లేకపోవడంతో శ్రీలంక దాదాపు ఈ రేస్ నుంచి నిష్క్రమించినట్లే. 

►ALSO READ | T20 World Cup: శ్రీలంక బ్యాటింగ్ ఢమాల్.. న్యూజిలాండ్ భారీ విజయం 

ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు చేరగా, న్యూజిలాండ్ 3 పాయింట్లతో పోటీలోకి వచ్చింది. మరోవైపు, ఈ ఓటమి పాకిస్తాన్‌కు కూడా పెద్ద ఎదురుదెబ్బగా మారింది. పాక్ జట్టు సెమీస్ చేరాలంటే శ్రీలంకపై గెలవడమే కాకుండా, న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చేతిలో ఓడాలని ఆశించాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్ వెళ్లే జట్టును ఎంపిక చేస్తారు. మొత్తంగా చూస్తే, న్యూజిలాండ్ ఈ విజయంతో సెమీఫైనల్ దిశగా అడుగులు వేయగా, శ్రీలంక జట్టు మాత్రం నిరాశగా టోర్నీ నుంచి తప్పుకున్నట్లైంది.