SL vs NZ: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కాగా కివీస్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, కోల్ మెక్‌కాన్చీ మాత్రమే జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దసున్ శనక ముందుగా బౌలింగ్ తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కి వచ్చిన కివీస్ బ్యాటర్లకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. దుష్మంత చమీర వేసిన నాలుగో ఓవర్ తొలి బంతిని టిమ్ సీఫెర్ట్ (8) డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో బాల్ ని కొట్టగా, కామిండు బౌండరీ దగ్గర జంప్ చేసి క్యాచ్ పట్టడంతో న్యూజిలాండ్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (23) ప్రారంభంలో కొంచెం దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ మహేష్ తీక్షణ బౌలింగ్ లో అతడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిఫ్స్ కాసేపు న్యూజిలాండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 9. 3 ఓవర్లో మంచి జోరు మీద కనిపించిన ఫిలిఫ్స్ ని దుష్మంత చమీరా క్లిన్ బౌల్డ్ చేశాడు. మరోవైపు 22 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సుతో 32 పరుగులు చేసిన తర్వాత తీక్షణ బౌలింగ్ లో దుషన్ హేమంతకి రచిన్ రవీంద్ర క్యాచ్ ఇచ్చి డకౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో 11 ఓవర్లకే కీలకమైన నాలుగు వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు స్కోర్ బోర్డు నెమ్మదించింది. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్ ఘోరంగా విఫలం కావడంతో 12 ఓవర్లలోనే 6 వికెట్లు నష్టాపోయిన కివీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
►ALSO READ | వరల్డ్‌కప్ గెలవడం పాకిస్తాన్ వల్ల కాదు.. సల్మాన్ ఆఘా భార్య సంచలన వ్యాఖ్యలు
ఆరు వికెట్లను కోల్పోయిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ శ్రీలంక బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. జస్ట్ 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 6 సిక్సులతో ఏకంగా 47 పరుగులు చేసిన దుష్మంత చమీరా బౌలింగ్ లో చరిత్ అసలంకకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మరో ఎండ్ లో ఉన్న కివీస్ బ్యాటర్ కోల్ మెక్‌కాన్చీ సైతం బ్యాట్ ఝలిపించాడు. 23 బాల్స్ లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 31 పరుగులు చేయగా.. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్లను కోల్పోయి 168 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బౌలర్లలో మహీష్ తీక్షణ, దుష్మంత చమీరా తలో మూడు వికెట్లు పడగొట్టగా, దునిత్ వెల్లలాగే ఒక వికెట్ తీసుకున్నాడు.
