హైకోర్టు ఆదేశాల మేరకే సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో పనులు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైకోర్టు ఆదేశాల మేరకే సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో పనులు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధి 2014లోనే నిర్ణయించబడిందని స్పష్టం చేశారు. ఒకసారి ఫిక్స్ చేసిన ఎఫ్‌టీఎల్ పరిమితుల్లో మార్పులు, చేర్పులు ఉండవని వెల్లడించారు రంగనాథ్.ఎఫ్‌టీఎల్ హద్దులను 5 ఎకరాలు మినహాయించి మార్చుతున్నారన్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపణలు నిరాధారమని ఖండించారు. హైకోర్టు ఆదేశాల మేరకే సున్నంచేరువు ఎఫ్టీఎల్ పరిధిలో పనులు జరుగుతున్నాయని అన్నారు.

సున్నం చెరువు దగ్గర గతంలో వేసిన ఫెన్సింగ్‌లో ప్రభుత్వ భూమి కలిసివున్నా, అది ఎఫ్‌టీఎల్‌కు వర్తించదని అన్నారు రంగనాథ్. చెరువు చెంత ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకుని పార్కులు, ప్లే ఏరియాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు.మాదాపూర్‌లోని తమ్మిడికుంట సహా మొదటి విడతలో చేపట్టిన 6 చెరువుల దగ్గర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు రంగనాథ్.

గతంలో హైడ్రా చర్యలకు సహకరించిన ఎమ్మెల్యే అకస్మాత్తుగా విమర్శలకు దిగడం ఆశ్చర్యకరమని అన్నారు.కూకట్‌పల్లి జోన్‌లో భూముల విలువ ఎక్కువగా ఉండటం వల్లే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. హైడ్రాకు వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో సుమారు 40శాతం కూకట్‌పల్లి జోన్ నుంచే వచ్చాయని వెల్లడించారు.చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసర స్థలాలు, ప్రభుత్వ భూములను కాపాడటం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఏ ఒక్కరి పక్షాన కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడేలా హైడ్రా చర్యలు ఉంటాయని..ఇప్పటివరకు 1,240 చోట్ల ఆక్రమణలు తొలగించి 1,310 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షించామని అన్నారు.