భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్న ఐదు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కొరడా ఝుళిపించింది. మంగళవారం (ఫిబ్రవరి 24, 2026) కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
బ్యాన్ అయిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్:
మూడ్ ఎక్స్ వీఐపీ (MoodXVIP)
కోయల్ ప్లే ప్రో (Koyal Playpro)
డిజి మూవీప్లెక్స్ (Digi Movieplex)
ఫీల్ (Feel)
జుగ్ను (Jugnu)
మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ ఐదు ఓటీటీలను ప్రభుత్వం నిషేధించింది. అశ్లీల మరియు అనుచిత కంటెంట్ ప్రసారం చేస్తున్నాయనే ఆరోపణల ఫిర్యాదులతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
యాక్సెస్ నిలిపివేతకు ఆదేశాలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021 (Information Technology Rules, 2021) ప్రకారం, అశ్లీలతకు వ్యతిరేక చట్టాల కింద ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్కు యాక్సెస్‌ను నిలిపివేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ ఓటీటీ వేదికలకు యాక్సెస్ నిలిపివేయబడింది.
చట్టపరమైన ఆధారం..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69A ప్రకారం, దేశ భద్రత, ప్రజా శాంతి, నైతిక విలువలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ కంటెంట్‌ను నిరోధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ నిర్ణయం నేపథ్యంలో డిజిటల్ వేదికలపై కంటెంట్ నియంత్రణ అంశం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
విస్తృత ప్రభావం..
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుతున్న ఈ కాలంలో కంటెంట్ నియంత్రణపై ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఈ పరిణామం సూచిస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎంతో క్రియేటివిటీ స్వేచ్ఛను కలిగి ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు సరైన కంటెంట్ అందించాల్సిన బాధ్యత ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్యతో డిజిటల్ కంటెంట్ నియంత్రణ అంశం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.
