SMA.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ. వెన్నెముక కండరాల క్షీణతే ఈ వ్యాధి ముఖ్య లక్షణం. SMAలో టైప్-1 చాలా డేంజర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన చిన్నారులను వెంటిలేటర్ మీద ఎక్కువ కాలం ఉంచితే..ట్యూబ్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. మానవుల శరీరంలో ఉండే ఒక జన్యువు ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రోటీన్లు కండరాలు, నరాలు మనుగడకు ఉపయోగపడతాయి.
ప్రోటీన్లను ఉత్పత్తి చేసే ఆ జన్యువు శరీరంలో లేకపోవడమే SMA. ఆ జీన్ లేకపోవడంతో ప్రొటీన్లు ఉత్పత్తి కావు. ప్రొటీన్లు ఉత్పత్తి కాకపోతే నరాలు, కండరాలు జీవం లేకుండా ఉంటాయి. నాడీ వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండదు. మెదడు వరకూ వ్యాపించి ఉండే నరాల పనితీరు సక్రమంగా ఉండదు. అలా జరిగితే.. ఆ చిన్నారి ఆహారం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి.
కోట్ల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధి SMA-Type 1. ఇది జన్యు లోపం కారణంగా వస్తుంది. దీని వల్ల బ్రెయిన్, నర్వస్, మజిల్, బోన్ డెవలప్‌మెంట్ సరిగా ఉండదు. బ్రెయిన్ నుంచి శరీర భాగాలకు సంకేతాలు అందించడంలో సమస్య ఏర్పడుతుంది. ఈ వ్యాధి బారినపడిన వాళ్లలో దాదాపు 70 శాతం మంది శ్వాస తీసుకునే కండరాల ఎదుగుదల లేక రెండు మూడేళ్ల వయసు వచ్చే లోపే చనిపోయే ముప్పు ఉంటుంది. అయితే జోల్‌జెన్‌స్మా ఇన్‌జెక్షన్ ద్వారా జీన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయడంతో పసికందులను రక్షించవచ్చు. వాళ్ల గ్రోత్ మళ్లీ నార్మల్ అయ్యేలా చేసే ఈ ఇన్‌జెక్షన్ కేవలం అమెరికాలో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. దీని ఖరీదు రూ.16 కోట్లు. ఇది తెప్పించుకోవడం సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు అయ్యే పని కాదు.
►ALSO READ | పునర్వికకు పునర్జన్మ.. మానవత్వం బతికే ఉంది.. ఇదీ సోషల్ మీడియా పవర్ !
అయితే.. విదేశాల్లో ఇలాంటి అరుదైన వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చుకు క్రౌండ్ ఫండింగ్ చాలా ఉపయోగపడుతుంది. మన దేశంలో కూడా ఈ క్రౌడ్ ఫండింగ్ సాధ్యమవుతుందని పునర్వికకు అందిన సాయం మన కళ్లకు కట్టింది. సామాజిక మాధ్యమాల ద్వారా పునర్వికకు ఆర్థిక సాయం అందిన తీరు చూస్తే.. సోషల్ మీడియాను సరైన తీరులో వినియోగిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని.. ఒక నిండు ప్రాణం నిలపవచ్చని రుజువైంది.
