పునర్వికకు పునర్జన్మ.. మానవత్వం బతికే ఉంది.. ఇదీ సోషల్ మీడియా పవర్ !

పునర్వికకు పునర్జన్మ.. మానవత్వం బతికే ఉంది.. ఇదీ సోషల్ మీడియా పవర్ !

పునర్విక.. గత కొన్నిరోజులుగా ఈ చిన్నారి గురించి సోషల్ మీడియాలో వేల వీడియోలు కనిపించాయి. కర్నూలు జిల్లా వెల్దుర్తి ప్రాంతానికి చెందిన సురేశ్‌ కుమార్, పుష్పావతి దంపతుల కూతురు పునర్విక. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్-1 అనే అరుదైన వ్యాధి ఈ చిన్నారిని పుట్టుకతోనే రావడం శోచనీయం. ఈ వ్యాధి చికిత్సకు వాడే ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు. ఒక ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లంటే మధ్య తరగతి కుటుంబం కొనగలిగే పరిస్థితి ఉంటుందా..? అలా అని నిస్సహాయతలో కూరుకుపోతే పాపను కాపాడుకోగలరా..? అలాంటి సమయంలో సోషల్ మీడియా పునర్విక పాలిట వరమైంది. ‘ఎక్స్’, ‘ఇన్ స్టాగ్రాం’, ఫేస్ బుక్.. ఈ సామాజిక మాధ్యమాలు పునర్వికకు పునర్జన్మను ప్రసాదించాయనడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే.. ఈ సామాజిక మాధ్యమాల వేదికగానే మానవత్వం విరాళాల రూపంలో విరాజిల్లింది. పునర్విక ప్రాణం నిలిపింది. పునర్విక కుటుంబం కోసం సోషల్ మీడియా వేదికగా ఒక మహా యజ్ఞమే జరిగింది. మానవత్వంతో స్పందించిన ప్రతీ ఒక్కరూ తమకు తోచినంత సాయం చేశారు. అలా పునర్విక కుటుంబానికి ఈ సమాజం బాసటగా నిలిచింది. పునర్విక కుటుంబానికి సుమారు రూ.10 కోట్ల వరకూ ఆర్థిక సాయం అందింది. మానవత్వం ఇంకా బతికే ఉందని మరోసారి రుజువైంది. దీనంతటికీ కారణం సోషల్ మీడియా.

మంచి కోసం, సాటి మనిషి కోసం సోషల్ మీడియాను వినియోగిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో పునర్వికకు అందిన సాయం చెప్పకనే చెప్పింది. ఇదే.. సోషల్ మీడియా ప్రముఖులను, ప్రభుత్వాన్ని కదిలించింది. దాతల నుంచి మంచి స్పందన వచ్చి దాదాపుగా రూ.10 కోట్ల వరకూ సమకూరాయని.. ఇంకా రూ. 6 కోట్ల వరకూ అవసరం ఉందని ఏపీ ప్రభుత్వాన్ని పునర్విక తల్లిదండ్రులు ఇదే సోషల్ మీడియా సాక్షిగా అభ్యర్థించారు.

అంత భరించే స్థోమత తనకు లేదని.. మిగిలిన 6 కోట్లు మీరు దయ ఉంచి సాయం చేస్తే మా పాప కోలుకుంటుందని పునర్విక తల్లిదండ్రులు మంత్రి నారా లోకేష్ను కోరారు. మంత్రి నారా లోకేష్ కూడా సానుకూలంగా స్పందించారు. పునర్వికకు సాయం చేసిన ప్రతీ ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని, మిగిలిన 6 కోట్ల సాయం ఇకపై తన వంతు అని.. తప్పకుండా అందిస్తామని పునర్విక తల్లిదండ్రులకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. సోషల్ మీడియా సామాన్యుడి చేతిలో ఉన్న ఒక వజ్రాయుధం. ఆ ఆయుధం మంచికి వాడితే ఫలితం ఎలా ఉంటుందో పునర్వికకు అందిన సాయమే ప్రత్యక్ష సాక్ష్యం.

►ALSO READ | వనపర్తి జిల్లాలో విషాదం.. ఇంత హ్యాపీగా ఉన్న ఈ ఇద్దరికీ ఏమైందో.. ఇలా చేశారు !