ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న ఏఐ టెక్నాలజీ మానవాళికి వరం అని కొందరు సంబరపడుతుంటే.. అది ఆర్థిక వ్యవస్థలనే కుప్పకూల్చే మారణాయుధంగా మారబోతోందని మరికొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనిపై తాజాగా సిట్రిని రీసెర్చ్ రిలీజ్ చేసిన '2028 గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్' రిపోర్ట్ ఇప్పుడు ప్రపంచ మార్కెట్లలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జేమ్స్ వాన్ గీలెన్, అలాప్ షా రూపొందించిన ఇది ఏఐ విప్లవం వల్ల 2028 నాటికి ప్రపంచం ఎదుర్కోబోయే భయంకరమైన ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించింది. లక్షల్లో ఉద్యోగాలు మాయం అవటం నుంచి ఆదాయం లేక ప్రజలు ఎదుర్కొనే కష్టాల వరకూ ప్రతిదీ పూసగుట్టినట్లు చెప్పింది రిపోర్ట్.
ఏమిటీ గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్?
2028 నాటికి ఏఐ వల్ల కంపెనీల్లో ప్రొడక్టివిటీ.. కార్పొరేట్ లాభాలు భారీగా పెరుగుతాయని రిపోర్ట్ పేర్కొంది. దీన్నే ఘోస్ట్ జీడీపీ అని పిలిచారు. అంటే.. పేపర్ల మీద చూడటానికి దేశం ఆర్థికంగా ఎదుగుతున్నట్లు కనిపిస్తుంది కానీ, క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజల ఆదాయం పడిపోతుందట. వైట్ కాలర్ ఉద్యోగాలను ఏఐ మింగేయడం వల్ల నిరుద్యోగం 10.2 శాతానికి చేరుతుందని, ప్రజల దగ్గర ఖర్చు చేసేందుకు డబ్బు లేక కొనుగోలు శక్తి పడిపోతుందని రిపోర్ట్ వెల్లడించింది.
భారత ఐటీ రంగానికి 'మరణ శాసనం'?
రిపోర్టులో అత్యంత ఆందోళనకరమైన అంశం భారత ఐటీ రంగం గురించి ఉంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలకు ఇది ఏఐ మరణ శాసనం వంటిదని పేర్కొంది. ఏఐ కోడింగ్ ఏజెంట్ల వల్ల కోడింగ్ ఖర్చులు కరెంట్ బిల్లుల స్థాయికి పడిపోతుందని, దీనివల్ల తక్కువ ధరకే సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ అందిస్తున్న భారతీయ కంపెనీల అవసరం లేకుండా పోతుందని బాంబు పేల్చింది. 2027 నాటికి ఇండియన్ ఐటీ కంపెనీలకు ప్రపంచ వ్యాప్తంగా క్లయింట్ల నుంచి ఉన్న వర్క్ కాంట్రాక్టులు రద్దయ్యే స్పీడ్ పెరుగుతుందని రిపోర్ట్ అంచనా వేసింది.
సర్వీస్ సెక్టార్ పైనే చాలా దశాబ్ధాలుగా ఆధారపడుతున్న ఇండియా.. ఏఐ కారణంగా రానున్న కాలంలో ఐటీ సేవలకు డిమాండ్ పడిపోవటం వల్ల ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం ఆవిరి కావడంతో.. భారతదేశం విదేశీ చెల్లింపుల సంక్షోభంలో పడుతుందని సిట్రిని రీసెర్చ్ విశ్లేషించింది. కేవలం నాలుగు నెలల్లోనే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 18% పడిపోవచ్చని, పరిస్థితిని చక్కదిద్దేందుకు 2028 మొదటి త్రైమాసికంలో భారత ప్రభుత్వం IMFతో చర్చలు ప్రారంభించే అవసరం వస్తుందట.
సాస్ అంతం..
సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్(SaaS) కంపెనీల పని అయిపోయిందని, ఏఐ ఏజెంట్ల సాయంతో కంపెనీలే సొంతంగా సాఫ్ట్‌వేర్లను తయారు చేసుకుంటాయని ఈ స్టడీ చెబుతోంది. అయితే ఈ విధ్వంసంలో కొన్ని దేశాలు లాభపడతాయని వెల్లడించింది. ఏఐకి అవసరమైన చిప్స్, హార్డ్‌వేర్ తయారు చేసే శామ్‌సంగ్, టీఎస్ఎంసీ వంటి సంస్థలు ఉన్న కొరియా, తైవాన్ దేశాలు విజేతలుగా నిలుస్తాయని పేర్కొంది.
►ALSO READ | లాభాలు తగ్గినా పర్లేదు: AI వాడుతూ పనిచేయండి.. టెక్కీలకు TCS సీఈఓ రిక్వెస్ట్
ఉద్యోగాల పరిస్థితి ఏంటి?
ఏఐ వల్ల కొత్తగా ప్రాంప్ట్ ఇంజనీర్స్ లాంటి జాబ్స్ వస్తాయి. కానీ అవి పోయిన ఉద్యోగాల్లో ఒక శాతం కూడా ఉండవని నివేదిక స్పష్టం చేసింది. అంటే 1000 ఉద్యోగాలు పోతే వాటి స్థానంలో కనీసం 10 కొత్త జాబ్స్ రావటం కూడా కష్టమేనట. పైగా కొత్తగా వచ్చే ఉద్యోగాలకు జీతాలు పాత ఉద్యోగాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయని తెలిపింది. ఒక కొత్త ఉద్యోగం వస్తే.. డజన్ల కొద్దీ పాత ఉద్యోగాలు కనుమరుగవుతాయని ఈ అధ్యయనం హెచ్చరించింది.
ఈ నివేదిక బయటకు వచ్చిన వెంటనే అమెరికా టెక్ కంపెనీ IBM షేర్లు గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయాయి. భారత ఐటీ షేర్లు కూడా భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇది 'ఊహాజనిత విశ్లేషణ' మాత్రమేనని, కచ్చితంగా ఇలాగే జరుగుతుందని తాము చెప్పడం లేదని క్లారిటీ ఇచ్చారు రైటర్స్. కొద్దిగా అటూ ఇటుగా పరిస్థితులు చూస్తుంటే ఏఐ మాత్రం ఊహించని షాక్ వేవ్స్ ప్రపంచానికి ఇవ్వటానికి నిశబ్ధంగా సిద్ధం అవుతోందని మాత్రం చెప్పుకోవచ్చు.
