TCS News: దేశంలోని టాప్ ఐటీ కంపెనీ TCS.. తన ఉద్యోగులకు ఒక సంచలన పిలుపునిచ్చింది. తమ రెగ్యులర్ వర్క్ డెలివరీలో ఏఐ టూల్స్ ఉపయోగించి పనిని వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయాలని కంపెనీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. దీనివల్ల కంపెనీకి వచ్చే ఆదాయం కొంతమేర తగ్గినప్పటికీ వెనక్కి తగ్గొద్దని.., కస్టమర్లకు మేలు చేయడమే ప్రాధాన్యతని టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్ వెల్లడించారు. ముంబైలో జరిగిన నాస్కామ్ టెక్నాలజీ లీడర్‌షిప్ ఫోరమ్‌లో ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఉద్యోగులు ఉత్సాహంగా ఉండాలని సూచిస్తూ ఈ కామెంట్స్ చేశారు కృతివారసన్.
ఐటీ రంగంలో ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కృతివాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏదైనా పనిని ఏఐ సహాయంతో వేగంగా, మెరుగ్గా చేయగలిగితే.. ఆ విషయాన్ని కస్టమర్లకు ధైర్యంగా చెప్పాలని సూచించారు. ఇది కంపెనీ ఆదాయాన్ని కొంతమేర దెబ్బతీసినా పర్వాలేదంటూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. టెక్నాలజీ మార్పును అడ్డుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని.. దాని వల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకోవడం ద్వారా మరిన్ని కొత్త అవకాశాలు తలుపు తడతాయని చెప్పారు.
►ALSO READ | NSE IX: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్: యాపిల్, గూగుల్ షేర్లలో ట్రేడింగ్ చేయెుచ్చు..
ప్రస్తుతం భారత ఐటీ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఏఐ వల్ల ఐటీ రంగంలోని సాంప్రదాయ లేబర్-ఓరియెంటెడ్ మోడల్‌కు ముప్పు పొంచి ఉందనే భయంతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గుతున్నారు. దీనివల్ల ఫిబ్రవరి నెలలోనే ఐటీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు 68.6 బిలియన్ డాలర్లు ఆవిరైంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా ఈ నెలలో 21 శాతం పతనమై, గత 23 ఏళ్లలో అత్యంత చెత్త పనితీరును కనబరిచింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో టీసీఎస్, విప్రో వంటి సంస్థలు ఏఐని ఒక ముప్పుగా కాకుండా.. డిమాండ్‌ను పెంచే ఒక సాధనంగా చూడటం విశేషం.
మరోవైపు విప్రో లాంటి ప్రత్యర్థి సంస్థలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం కంటే.. కొత్త ఉద్యోగాల సృష్టి ఎక్కువగా ఉంటుందని విప్రో చీఫ్ స్ట్రాటజిస్ట్ హరి శెట్టి అభిప్రాయపడ్డారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి. మొత్తానికి ఏఐ రంగప్రవేశంతో ఐటీ సర్వీసుల స్వరూపం మారుతున్నా.. స్పీడ్ అండ్ క్వాలిటీలకు ప్రాధాన్యతనిస్తూ తన మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవాలని టీసీఎస్ వ్యూహరచన చేస్తోంది.
