ఇకపై భారతీయ ఇన్వెస్టర్లు కేవలం దేశీయ మార్కెట్లకే పరిమితం కానక్కర్లేదు. ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్(NSE IX) తీసుకువచ్చిన గ్లోబల్ యాక్సెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30కి పైగా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం లభించనుంది. దీనికి సంబంధించి తొలి దశలో అమెరికా మార్కెట్లలో ట్రేడింగ్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు ఎన్ఎస్ఈ ఐఎక్స్ ఎండీ, సీఈఓ వి. బాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు.
LRS పరిమితిలో పెట్టుబడులు:
RBI రూల్స్ ప్రకారం అమల్లో ఉన్న లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఈ పెట్టుబడులు జరుగుతాయి. దీని ప్రకారం ప్రతి భారతీయ పౌరుడు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రెండున్నర లక్షల అమెరికన్ డాలర్లు అంటే సుమారు రూ.2 కోట్ల వరకు విదేశాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ ఆర్‌బీఐ నిబంధనలకు లోబడే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ – సామాన్యులకు వరం:
ఈ ప్లాట్‌ఫారమ్‌లోని అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఫ్రాక్షనల్ ట్రేడింగ్. సాధారణంగా ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల షేర్ల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సౌకర్యం ద్వారా ఇన్వెస్టర్లు ఒక పూర్తి షేర్ కొనాల్సిన అవసరం లేకుండా.. తమ వద్ద ఉన్న చిన్న మొత్తంతో షేరులో కొంత భాగాన్ని కొనుక్కోవచ్చు. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు అంతర్జాతీయ కంపెనీల్లో భాగస్వామ్యం పొందేందుకు గొప్ప అవకాశం కల్పిస్తుంది.
డిజిటల్ కేవైసీ:
పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేసేందుకు పూర్తిగా డిజిటల్ KYC విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆధార్, పాన్ కార్డు లేదా డిజిలాకర్ ద్వారా కేవలం 30 నుండి 45 సెకన్లలోనే వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు. వెరిఫికేషన్ పూర్తయ్యాక.. గిఫ్ట్ సిటీలోని నిర్ణీత బ్యాంక్ ఖాతాకు నిధులు బదిలీ చేస్తే, వెంటనే యాప్‌లో ట్రేడింగ్ పవర్ లభిస్తుంది. ఇక్కడ పెట్టుబడులన్నీ డాలర్ల రూపంలోనే జరుగుతాయి.
LRS రూల్స్ ప్రకారం ప్రస్తుతం కేవలం ఈక్విటీ షేర్లు, ఈటీఎఫ్ లలో మాత్రమే పెట్టుబడికి అనుమతి ఉంది. డెరివేటివ్స్, క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ అసెట్స్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉండవు. భవిష్యత్తులో మూడవ దశలో మ్యూచువల్ ఫండ్స్ వంటి సంస్థాగత ఇన్వెస్టర్లకు కూడా ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు.
