ఏప్రిల్ 1 నుండి కొత్త టాక్స్ రూల్స్.. HRA క్లెయిమ్ కోసం ఇలా చేశారో 200% పెనాల్టీ!

ఏప్రిల్ 1 నుండి కొత్త టాక్స్ రూల్స్.. HRA క్లెయిమ్ కోసం ఇలా చేశారో 200% పెనాల్టీ!

పన్ను చెల్లింపును తగ్గించుకోవటం లేదా తప్పించుకోవటం కోసం జనం చేసే పనులు అన్నీ ఇన్నీ కాదు. అయితే కొత్త పన్ను చట్టాలతో వీటికి చెక్ పెట్టాలని మోడీ సర్కార్ పెద్ద ప్లాన్ సిద్ధం చేస్తోంది. దీని ప్రకారం ఇన్కమ్ టాక్స్ సేవ్ చేసుకోవడం కోసం మీ నాన్నకో లేదా భార్యకో అద్దె కడుతున్నట్లు చూపిస్తున్నారా? అయితే ఇకపై ఆ పప్పులు ఉడకవు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఆదాయపు పన్ను చట్టం, 2025 రూల్స్ ప్రకారం.. పాత పన్ను విధానంలో హౌస్ రెంట్ అలవెన్స్(HRA) క్లెయిమ్ చేసే ఉద్యోగుల కోసం ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకువస్తోంది. ఇకపై కేవలం రెంట్ రిసీప్ట్ ఇస్తే సరిపోదు.. యజమానితో మీకున్న సంబంధాన్ని కూడా స్పష్టంగా వెల్లడించాల్సిందే.

కొత్త రూల్స్ కింద ఏడాదికి అద్దె రూ.లక్ష దాటితే.. ఆ అద్దె ఇంటి యజమాని పేరు, అడ్రస్, పాన్ కార్డు వివరాలతో పాటు.. సదరు వ్యక్తి మీకు ఏమవుతారో కూడా డిక్లేర్ చేయాలి రిటర్న్ ఫైలింగ్ సమయంలో. ఫేక్ రెంట్ రిసీప్టులతో పన్ను ఎగవేసే వారికి చెక్ పెట్టడమే ఈ డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్, 2026 ప్రధాన ఉద్దేశం. బంధువులకు అద్దె కట్టడం నేరం కాదు.. కానీ ఆ లావాదేవీ పక్కాగా ఉండాలి.

కేవలం కాగితాల మీద రెంట్ చూపిస్తే ఇకపై కుదరదు. టాక్స్ అధికారులు ఇప్పుడు డబ్బు చేతులు మారిన విధానం మీద ఫోకస్ చేస్తున్నారు. అద్దెను నగదు రూపంలో కాకుండా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పంపడం, సరైన రెంటల్ అగ్రిమెంట్ కలిగి ఉండటం తప్పనిసరి. అన్నింటికంటే ముఖ్యంగా మీరు ఎవరికైతే అద్దె కడుతున్నారో.. వారు కూడా తమ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్‌లో పొందిన అద్దెను ఆదాయంగా చూపించాల్సిందే. మీ క్లెయిమ్‌కు, వారి ఇన్కమ్ రిపోర్ట్‌కు తేడా వస్తే వెంటనే నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ వివరాలు దాచినా లేదా తప్పుడు సమాచారం ఇచ్చినా జరిమానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అక్రమంగా పొందిన పన్ను ప్రయోజనంపై ఏకంగా 200% వరకు పెనాల్టీ విధించే అధికారం అధికారులకు ఉంటుంది. అలాగే వడ్డీతో సహా పన్ను చెల్లించాల్సి వస్తుంది. డేటా అనలిటిక్స్ సాయంతో టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షిస్తోంది కాబట్టి, చిన్న పొరపాటు చేసినా దొరికిపోతారు ఖచ్చితంగా.

సందర్భానుసారంగా మార్కెట్ రేటు కంటే ఎక్కువ రెంట్ చూపించినా అధికారులకు అనుమానం వస్తుంది. కాబట్టి 2026 ఏప్రిల్ నుండి అమలు కాబోయే ఈ కొత్త నిబంధనల దృష్ట్యా, శాలరీడ్ ఎంప్లాయీస్ తమ HRA క్లెయిమ్స్ విషయంలో డాక్యుమెంట్లు అన్నీ రెడీగా ఉంచుకోవాలి. అనధికారిక ఒప్పందాలకు స్వస్తి చెప్పి, పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. ఇప్పటి వరకూ రెంట్ కట్టినట్లు రిసీట్ ఓనర్ పాన్ వివరాలు ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ అయ్యేది కానీ ఇకపై మనీ ట్రైల్ నిర్వహించటంతో టాక్స్ కట్టకుండా తప్పించుకోవటం అసాధ్యమే.