రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం (ఫిబ్రవరి 25) తొలి రోజు ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించారు. ప్రధాని మోదీకి పార్లమెంటు సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించడం గౌరవంగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.
ఇజ్రాయెల్ కు రెండోసారి రావడం సంతోషంగా ఉందన్న మోదీ.. పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిని తానేనని చెప్పారు. ఇజ్రాయెల్ లో 140 కోట్ల భారతీయుల స్నేహం ముడిపడి ఉందన్నారు. భారత్, ఇజ్రాయెల్.. ప్రాచీన నాగరికత కలిగిన దేశాలని కొనియాడారు.
►ALSO READ | ప్రధాని మోదీకి నెతన్యాహు ఘన స్వాగతం.. ఇజ్రాయెల్ పర్యటన వివరాలు ఇవే !
టెర్రరిజాన్ని ఉపేక్షించేది లేదన్న భారత ప్రధాని.. టెర్రరిజం ఎక్కడున్నా నిర్మూలించేందుకు భారత్ సహకరిస్తుందని తెలిపారు. ఉగ్రవాదంలో పోరుకు ఇజ్రాయెల్ కు పూర్తిగా అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు. భారత్ కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదంతో పోరాడుతోందని.. టెర్రరిజంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. హమాస్ దాడి చేసి పౌరులను చంపడం చాలా దారుణగా అభివర్ణించారు. పౌరుల హత్యలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించమని ఈ సందర్భంగా అన్నారు.
మోదీ స్నేహితుడి కంటే ఎక్కువ.. నా సోదరుడు: నెతన్యాహు
అంతకు ముందు పార్లమెంటులో ప్రసంగించి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. మోదీ తనకు స్నేహితుడి కంటే ఎక్కువ.. తన సోదరుడు అంటూ ఆత్మీయ ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాల్లో మోదీ గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. మోదీ పర్యటన ఎంతో సంతోషదాయకమన్నారు. మోదీ భారత్ ను అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. భారత్ ఇజ్రాయెల్ మధ్య అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేమని తెలిపారు.
