మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు

మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు
  • 18న మేడారానికి సీఎం.. రాత్రి అక్కడే బస.. 19న తల్లుల దర్శనం: మంత్రి సీతక్క
  • మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
  • రాజకీయాలకతీతంగా జాతరను సక్సెస్ చేద్దామంటూ మంత్రి పిలుపు 

ములుగు / తాడ్వాయి, వెలుగు:  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు ఈసారి ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డు ఇవ్వనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు.  ఔషధంగా ఉపయోగపడే ఇప్పపువ్వును అమ్మవార్ల ప్రసాదంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ ఆవరణలో మీడియా కో ఆర్డినేషన్​ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. జాతర ప్రత్యేకంగా ఇప్ప పువ్వు ప్రసాదం 
అందించాలని గతంలోనే అనుకున్నామని..ఈ సారి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. లడ్డు తయారీ ద్వారా మహిళా స్వయం సహాయ సంఘాల్లోని 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.సమ్మక్క, సారలమ్మ చరిత్రను సజీంగా ఉంచేలా, ఆదివాసీల అస్తిత్వం నలుదిక్కులు చాటేలా మేడారంలో కొత్త చరిత్ర నిర్మితమైందన్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రజలకు చేరువ చేయడంలో మీడియా పాత్ర మరువలేనిదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. 

19న జాతరను ప్రారంభించనున్న సీఎం..

సీఎం రేవంత్ రెడ్డికి మేడారం తల్లులంటే ఎంతో ప్రేమ అని.. 2010 నుంచి దర్శింకుంటున్నారని సీతక్క తెలిపారు. మేడారంలో గద్దెల మార్పు, విస్తరణ ఏర్పాట్లను మొదలు పెట్టి.. పూర్తి చేసే వరకు ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకున్నారన్నారు. ఈ నెల 18న సీఎం మేడారం జాతరకు వస్తున్నారని.. రాత్రి అక్కడే బస చేసి 19న ఉదయం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాజకీయాలకతీతంగా దేవతల పండుగను ఘనంగా నిర్వహించుకుందామన్నారు. సుందరీకరణ పనులు చివరిదశకు చేరుకున్నాయన్నారు. మేడారంలో రూ.101 కోట్లతో గద్దెల విస్తరణ, రూ.150కోట్లతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకుంటున్నామని.. ఆదివాసీ విద్యార్థుల రీసెర్చ్​ఆధారంగా  సమ్మక్క సారలమ్మల చరిత్రను 7వేల చిత్రాల ద్వారా శిలలపై  చెక్కించినట్టు తెలిపారు. మేడారంలో  కొమురంభీం, బిర్సాముండా తదితరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. జాతరలో మీడియాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేడారంలో జోన్ల  వారీగా ఆఫీసర్ల కేటాయింపు, భద్రత  అంశాలపై కలెక్టర్, ఎస్పీ వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.