- అందుకే 2 వేల ఈవీ బస్సుల కొనుగోలుకు ప్రైవేటు కంపెనీతో ఒప్పందం
- రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు రేవంత్‌కు మనసు రావడం లేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను కాపాడాలని కార్మికులు పోరాడుతుంటే.. ప్రభుత్వం మాత్రం సంస్థలోని ఒక్కో విభాగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. కాలుష్య నియంత్రణ పేరుతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీని కార్పొరేట్ శక్తులకు అప్పగించి.. వారికే సబ్సిడీలు ఇస్తూ సంస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
ఏకంగా 2,000 ఈవీ బస్సుల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నదని, కరెంట్ బస్సుల ముసుగులో సంస్థను ప్రైవేట్‌పరం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకుందని ఆరోపించారు. గురువారం టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు.. హరీశ్‌ను వేర్వేరుగా కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలను నేరుగా ఆర్టీసీకే ఇప్పించి, సంస్థ సొంతంగా బస్సులు కొనుగోలు చేసుకునేలా పథకంలో సవరణలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జీరో టికెట్ అమలు కోసం ప్రతి నెలా రూ.350 కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు అరకొర నిధులు చెల్లించి, చేతులు దులుపుకుంటున్నదని మండిపడ్డారు.
రెండేండ్లుగా ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల భారాన్ని సంస్థపైనే మోపడం వల్ల ఆర్థికంగా కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పటికే రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని, 2025 పీఆర్సీ కూడా అమలుకు నోచుకోకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంస్థలో రిటైర్ అయిన ఉద్యోగులు క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)లో దాచుకున్న పొదుపు మొత్తాలకు ప్రభుత్వం గత 23 నెలలుగా వడ్డీ చెల్లించడం లేదని మండిపడ్డారు. ఫ్రీ బస్ స్కీమ్‌కు తగ్గట్టుగా రద్దీకి సరిపడా కొత్త బస్సులు కొనడంలో, సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులంటే ఎందుకు చిన్నచూపు..
రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నదని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లంటే సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత చిన్న చూపు అని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో రిటైర్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ బకాయిలు రాక ఎంతో మంది మనోవేదనకు గురై ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని, రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని చెప్పారు.
