దేశంలోని రెండవ అతిపెద్ద టెక్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న టెక్కీలకు ఒక కీలకమైన అలర్ట్ జారీ అయింది. ఎప్పుడూ వేడివేడి దోశలు, ఆమ్లెట్లు.. నచ్చిన వంటకాలతో సందడిగా ఉండే ఆఫీస్ క్యాంపస్ ఫుడ్ కోర్టులు ఇప్పుడు కళ తప్పనున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, పూణే నగరాల్లోని ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్లలో గ్యాస్ షార్టేజీ సెగలు మొదలయ్యాయి. కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఆహార సేవల విషయంలో అంతరాయం కలగవచ్చని మేనేజ్‌మెంట్ తాజాగా ఈమెయిల్ ద్వారా టెక్కీలకు తెలియజేసింది.
లిమిటెడ్ మెను..
మిడిల్ ఈస్ట్ గల్ఫ్ లో కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. దీని ప్రభావంతో భారత్‌లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తీవ్రమైంది. గ్యాస్ సరఫరాదారులు పరిమితంగానే సిలిండర్లను అందిస్తుండటంతో.. ఇన్ఫోసిస్ తన ఫుడ్ కోర్టుల నిర్వహణలో కీలక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే మార్చి 12 నుంచి లైవ్ కుకింగ్ కౌంటర్లను తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే టెక్కీలు ఇష్టంగా తినే వేడివేడి టిఫిన్లు ఇకపై అందుబాటులో ఉండకపోవచ్చు.
ఇంటి నుంచే క్యారేజ్ తెచ్చుకోండి..
గ్యాస్ సరఫరా సమస్యల దృష్ట్యా కేవలం లిమిటెడ్ మెనూను మాత్రమే ఫుడ్ కోర్టుల్లో అందుబాటులో ఉంచాలని కంపెనీ నిర్ణయించింది. ఎక్కువగా గ్యాస్ అవసరమయ్యే వంటకాలను పక్కన పెట్టి.. ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లేదా బయో ఇంధనం ద్వారా వండగలిగే పదార్థాలనే అందించనున్నారు ఇన్ఫోసిస్ క్యాంటీన్లలో. అవసరమైతే వెండర్ల సెంట్రల్ కిచెన్ల నుంచి బయటి నుంచి వండిన ఆహారాన్ని తెప్పించనున్నారు. ముఖ్యంగా బెంగళూరు క్యాంపస్‌లో రోజుకు 20వేల మందికి పైగా ఉద్యోగులు ఉంటారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న సిబ్బందికి ఆహారం అందించడం సవాలుగా మారడంతో.. వీలైనంత వరకు ఇంటి నుండే భోజనం తెచ్చుకోవాలని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు సూచించింది.
►ALSO READ | గ్యాస్ లేదు.. కనీసం కిరోసిన్ అయినా పంపండి: కేంద్రానికి రేషన్ డీలర్ల రిక్వెస్ట్
ఎలాంటి ఈవెంట్స్ వద్దు..
పర్యావరణ హితం కోసం ఇన్ఫోసిస్ తన క్యాంపస్‌లలో బయోగ్యాస్ ప్లాంట్లు, ఆర్గానిక్ వేస్ట్ కన్వర్టర్లను ఏర్పాటు చేసినప్పటికీ.. భారీ అవసరాలకు అవి సరిపోవడం లేదు. సాధారణంగా ఆహార వ్యర్థాల నుంచి తయారయ్యే బయోగ్యాస్‌ను కిచెన్లలో వాడుతున్నా.. ప్రధాన వంటలకు ఎల్‌పీజీపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా క్యాంపస్‌లలో ఎటువంటి కేటరింగ్ ఈవెంట్లు ప్లాన్ చేయవద్దని కూడా కంపెనీ హెచ్చరించింది. గ్యాస్ కొరత సమస్య సద్దుమణిగే వరకు టెక్కీలు తమ భోజన ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
