గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు షాక్: 45 రోజులకు పెరిగిన సిలిండర్ బుకింగ్ గడువు

గ్రామీణ గ్యాస్ వినియోగదారులకు షాక్: 45 రోజులకు పెరిగిన సిలిండర్ బుకింగ్ గడువు

దేశంలో ప్రస్తుతం నెలకొన్న LPG కొరత గ్రామీణ ప్రాంత వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్ బుకింగ్ చేసుకునే సమయాన్ని (లాక్-ఇన్ పీరియడ్) గతంలో ఉన్న 25 రోజుల నుంచి ఏకంగా 45 రోజులకు పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్లీ 45 రోజుల వరకు మరోసారి గ్యాస్ బుకింగ్‌కు అవకాశం ఉండదు. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా దేశీయ గ్యాస్ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైందని చమురు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.

గ్యాస్ కొరత వార్తలతో ప్రజల్లో నెలకొన్న భయాందోళన పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయని అధికారులు పేర్కొంటున్నారు. వినియోగదారులు ముందస్తుగా సిలిండర్లను నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించడంతో బుకింగ్ సంఖ్య అసాధారణంగా పెరిగిపోయింది. అయితే పంపిణీ వ్యవస్థలో ఎక్కడా పూర్తిస్థాయిలో నిల్వలు నిలిచిపోలేదని, సరఫరాను క్రమబద్ధీకరించేందుకే బుకింగ్ సైకిల్‌ను పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇండియా అనేక దేశాల నుండి ఎల్పీజీని దిగుమతి చేసుకునే ప్రక్రియ వేగవంతమైందని, పరిస్థితి త్వరలోనే అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

మరోవైపు వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ల విషయంలోనూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆయా ప్రాంతాల్లోని ప్రాధాన్యతలను బట్టి వాణిజ్య సిలిండర్లను విడుదల చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది. పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వారి సగటు నెలవారీ అవసరంలో 20 శాతం కోటాను తక్షణమే కేటాయించాలని నిర్ణయించింది. హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలకు గ్యాస్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఇంధన మార్గాలను కూడా ప్రభుత్వం సూచిస్తోంది.

గ్యాస్ కొరతను తగ్గించేందుకు రాష్ట్రాలకు అదనంగా 48వేల కిలోలీటర్ల కిరోసిన్‌ను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. పరిస్థితి సద్దుమణిగే వరకు అంటే సుమారు నెల రోజుల పాటు హాస్పిటాలిటీ, వాణిజ్య రంగాల్లో బయోమాస్, బొగ్గు, కిరోసిన్ వినియోగించుకోవచ్చని పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. కాగా దేశంలో పెట్రోల్, డీజిల్ వంటి ఇతర ఇంధనాల కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. మార్చి 5 నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని 28 శాతం మేర పెంచడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో.