పీరియడ్స్ సమస్యతో కాలేజీకి అరగంట లేట్.. ప్రూఫ్ అడిగిన లెక్చరర్లు

పీరియడ్స్ సమస్యతో కాలేజీకి అరగంట లేట్.. ప్రూఫ్ అడిగిన లెక్చరర్లు
  •     ఇంటర్​ఎగ్జామ్​ కూడా రాయనియ్యలే
  •     తోటి విద్యార్థినుల ముందు అడగడంతో అవమానంగా భావించిన స్టూడెంట్​
  •     అదే ఆలోచిస్తూ బ్రెయిన్​లో రక్తం గడ్డకట్టి మృతి

పద్మారావునగర్, వెలుగు: కాలేజీకి అరగంట ఆలస్యంగా వచ్చిన ఓ ఇంటర్​ విద్యార్థినిని తోటి విద్యార్థుల ముందు లెక్చరర్లు అనరాని మాట అనడంతో అవమానంగా భావించిన ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. వారి మాటల గురించే ఆలోచిస్తూ ఒత్తిడికి గురై బ్రెయిన్​లో రక్తం గడ్డ కట్టి కన్నుమూసింది. సికింద్రాబాద్​ వెస్ట్  మారేడుపల్లికి చెందిన ఓ విద్యార్థిని (17) ప్రభుత్వ బాలికల జూనియర్  కాలేజీలో ఫస్టియర్​ చదువుతోంది. 

కాలేజీలో గురువారం ఇంటర్నల్​ఎగ్జామ్స్​ నిర్వహించారు. అయితే, పీరియడ్స్​ సమస్యలతో  ఆ విద్యార్థిని 40 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది. ఆలస్యం కావడానికి లెక్చరర్లు కారణం అడిగారు. తాను పీరియడ్స్​లో వచ్చే సమస్యలు ఎదుర్కొంటున్నానని, అందుకే ఆలస్యమైందని ఆమె సమాధానం ఇచ్చింది. దీనికి సదరు లెక్చరర్లు ‘‘నువ్వు పీరియడ్స్​లో ఉన్నవనడానికి రుజువు ఏమిటి?’’ అని అడిగారు. తోటి విద్యార్థులు, స్నేహితుల ముందు ఆ మాట అనడంతో బాలిక తట్టుకోలేకపోయింది. 

అంతేకాకుండా పరీక్ష రాయడానికి కూడా అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్థిని అదే  విషయాన్ని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్లి తన తల్లికి చెప్పింది. ఇంతలోనే ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు మల్కాజిగిరి దవాఖానకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీకి తీసుకువెళ్లారు. అప్పటికే బాధితురాలి ఎడమ చేయి, కాలు పని చేయలేని స్థితికి చేరుకున్నాయి. 

స్కానింగ్  చేసిన డాక్టర్లు.. తీవ్రమైన ఒత్తిడి వల్ల ఆమె బ్రెయిన్​లో రక్తం గడ్డ కట్టిందని చెప్పారు. గాంధీలో ట్రీట్​మెంట్​ఇస్తుండగానే గురువారం అర్ధరాత్రి చనిపోయింది. కాగా.. విద్యార్థిని మృతికి బాధ్యులైన లెక్చరర్లను అరెస్టు​చేయాలని శుక్రవారం కాలేజీ ఎదుట ఆమె తల్లిదండ్రులు, ఓయూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఘటనపై మారేడుపల్లి పోలీసులు కేసు  నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.