యాదాద్రి జిల్లాలో ముగిసిన వడ్ల రవాణా టెండర్లు ..ఏడు సెక్టార్ల లో 330 సెంటర్లు, 280 లారీలు 

యాదాద్రి జిల్లాలో ముగిసిన వడ్ల రవాణా టెండర్లు ..ఏడు సెక్టార్ల లో 330 సెంటర్లు, 280 లారీలు 

 యాదాద్రి, వెలుగు :  యాదాద్రి భువనగిరి జిల్లాలో వడ్ల తరలింపునకు సంబంధించిన కీలకమైన ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్ టెండర్ల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని 17 మండలాల్లో ఏర్పాటు చేయనున్న 330 కొనుగోలు కేంద్రాలను ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, మోత్కూరు, రామన్నపేట, వలిగొండను ఏడు సెక్టార్లుగా  విభజించి, ఒక్కో సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 40 లారీల చొప్పున మొత్తం 280 లారీలను రవాణా కోసం కేటాయించనున్నారు. ఎఫ్​సీఐ నిర్ణయించిన బేస్ రేటు ప్రకారం టెండర్లు ఆహ్వానించగా, వచ్చిన పది బిడ్లలో నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఏడింటిని అధికారులు ఖరారు చేశారు. ఈ టెండర్లలో రవాణాదారులు బేస్ రేటు కంటే 8 నుంచి 10 శాతం అదనపు రేటును కోట్ చేయగా, తుది అనుమతి కోసం ఈ వివరాలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా ఎఫ్​సీఐ ఉన్నతాధికారులకు పంపించారు. అనుమతి లభించిన తర్వాత టెండర్ దక్కించుకున్న ప్రతి వ్యక్తి రూ. 40 లక్షల గ్యారెంటీ మొత్తాన్ని పౌర సరఫరాల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. టెండర్ ఖరారైన తర్వాత రవాణా నిర్వహణకు ముందుకు రాని పక్షంలో, వారు చెల్లించిన రూ. 10 లక్షల ఈఎండీ మొత్తాన్ని ప్రభుత్వం జప్తు చేయనుంది. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వడ్లను తరలించడంతో పాటు, గోడౌన్ల నుంచి కేంద్రాలకు గన్నీ బ్యాగులను చేరవేయడంలో ఈ రవాణా వ్యవస్థే కీలకం కానుంది. ఉన్నతాధికారుల నుంచి క్లియరెన్స్ రాగానే ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది.