టెలికాం కంపెనీలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఫైర్

టెలికాం కంపెనీలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని ఫైర్

న్యూఢిల్లీ: కఠినమైన రీచార్జ్ నిబంధనల వల్ల అత్యవసర సమయాల్లో లక్షలాది మంది ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా బుధవారం  రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. రీచార్జ్ వ్యాలిడిటీ ముగియగానే ఇన్‌‌కమింగ్ కాల్స్ ఆపేస్తున్నారని, దీనివల్ల అత్యవసర సమయాల్లోనూ ఎవరినీ సంప్రదించలేని పరిస్థితి ఎదురవుతోందని, చివరికి బ్యాంక్ ఓటీపీల వంటి ముఖ్యమైన సందేశాలు కూడా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’​వేదికగా షేర్​చేశారు. దేశంలోని 125 కోట్ల మొబైల్ వినియోగదారుల్లో దాదాపు 90 శాతం మంది ప్రీపెయిడ్ కస్టమర్లేనని ఆయన గుర్తుచేశారు. ‘‘నెలవారీ ప్లాన్ అంటే క్యాలెండర్ ప్రకారం 30 లేదా 31 రోజులు ఉండాలి. కానీ టెలికాం కంపెనీలు 28 రోజుల సైకిల్‌‌ను నడుపుతూ, నెల ప్లాన్​ అని చెప్పి వినియోగదారుల చేత ఏడాదికి 13 సార్లు రీచార్జ్ చేయించుకొని దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. 

రీచార్జ్ చేయకపోతే సిమ్ కార్డులను వెంటనే డీయాక్టివేట్ చేయడం వల్ల వృద్ధులు, మొబైల్​తక్కువగా వాడేవారు, విదేశాల్లో ఉండేవారు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

ఏడాదిపాటు ఇన్​కమింగ్​ కొనసాగించాలి

చివరి రీచార్జ్ తర్వాత కనీసం ఏడాది పాటు ఇన్‌‌కమింగ్ కాల్స్, ఎస్​ఎంఎస్​ సేవలను కొనసాగించాలని రాఘవ్​ చద్దా డిమాండ్​చేశారు.  రీచార్జ్ లేకపోయినా కనీసం మూడేళ్ల వరకు మొబైల్ నెంబర్‌‌ను డీయాక్టివేట్​ చేయొద్దన్నారు. కేవలం ఓటీపీలు, ప్రభుత్వ సేవలు, అవసరమైన కాల్స్ కోసం తక్కువ ధరకే ‘ఇన్‌‌కమింగ్ ఓన్లీ’ ప్లాన్లను అందుబాటులోకి తేవాలన్నారు. 

రీచార్జ్ ప్లాన్లు 28 రోజులకు బదులుగా క్యాలెండర్ నెల ప్రకారం మార్చాలని డిమాండ్​చేశారు. ప్రీపెయిడ్ కస్టమర్లకు పారదర్శకత, న్యాయం కావాలి కానీ.. కంపెనీల తెలివైన నిబంధనలు కాదు అని నొక్కిచెప్పారు. ప్రస్తుత టెలికాం ప్లాన్లలో డేటా అవసరం లేని వారు కూడా బలవంతంగా డేటా ప్యాక్‌‌ల కోసం చెల్లించాల్సి వస్తోందని, ఈ విధానంలో మార్పు తేవాలని ఆయన కోరారు.