అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం.. కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా ప్రజాస్వామ్యానికి అవమానం: కిషన్‌ రెడ్డి

అసెంబ్లీ స్పీకర్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం.. కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా ప్రజాస్వామ్యానికి అవమానం: కిషన్‌ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అవమానం కలుగుతోందన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఇతర ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ ‘క్లీన్‌ చిట్‌’ ఇవ్వడంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ నిర్ణయం తెలంగాణ ప్రజల తీర్పును కాలరాయడమేనని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి రాజ్యాంగ వ్యవస్థలను అధికార పార్టీ చేతిలో బందీగా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజా తీర్పును అంగట్లో సరకులా మారుస్తుంటే, స్పీకర్‌ దానికి వత్తాసు పలకడం దురదృష్టకరమన్నారు.

ఫిరాయింపులను అరికట్టాల్సిన అత్యున్నత పదవిలో ఉండి, వాటికి చట్టబద్ధత కల్పించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ‘అధికార దుర్వినియోగంతో వ్యవస్థలను మేనేజ్‌ చేయవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది.  కానీ.. ప్రజల ఆగ్రహాన్ని మేనేజ్‌ చేయడం ఎవరి తరం కాదు. కళ్ల ముందు జరుగుతున్న ఈ అన్యాయాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోంది. రాజ్యాంగాన్ని పరిహసిస్తున్న వారికి ప్రజా క్షేత్రంలో తగిన శాస్తి తప్పదు’ అని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు.

బీఆర్‌ఎస్‌ అనైతిక దారిలోనే..

పార్టీ ఫిరాయింపుల విషయంలో నాడు బీఆర్‌ఎస్‌ తీరునే నేడు కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తోందని కిషన్​ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. సీఎం సమక్షంలో కండువా మార్చుకుని, ఏకంగా కాంగ్రెస్‌ బీఫామ్‌ మీద ఎంపీగా తనపైనే పోటీ చేసినా సాక్ష్యాలు సరిపోవా? అని ప్రశ్నించారు.  సామాన్యులందరికీ స్పష్టంగా కనిపిస్తున్న ఈ ఆధారాలు స్పీకర్‌కు ఎందుకు కనిపించడం లేదన్నారు. ‘గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన అనైతిక రాజకీయాలనే నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ రెండు పార్టీల ఆలోచనా శైలి, వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు’ అని కిషన్​రెడ్డి విమర్శలు గుప్పించారు.

బీఆర్‌‌ఎస్‌ మాదిరిగానే కాంగ్రెస్ తీరు..

ఫిరాయింపుల విషయంలో నాడు బీఆర్ఎస్ పార్టీ అనుసరించిన తీరునే నేడు కాంగ్రెస్ కొనసాగిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడవడంలో ఆ రెండు పోటీ పడుతున్నాయని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌ పార్టీలో చేరి మంత్రులయ్యారని.. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎంపీలుగా పోటీ చేస్తున్నారని విమర్శించారు. ప్రజా తీర్పును అంగట్లో సరకులా మార్చి, పదవుల కోసం పాకులాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.