శ్రీధర్ వెంబు విడాకుల కేసు.. భార్య ఆరోపణలు.. జోహో వెంబు వివరణ.. అసలేం జరుగుతోంది?

శ్రీధర్ వెంబు విడాకుల కేసు.. భార్య ఆరోపణలు.. జోహో వెంబు వివరణ.. అసలేం జరుగుతోంది?

దేశీయ టెక్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు.. ఆయన భార్య ప్రమీలా శ్రీనివాసన్ మధ్య జరుగుతున్న విడాకుల పోరాటం ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 5 బిలియన్ డాలర్లు దాదాపు రూ. 45వేల కోట్లకు పైగా విలువైన సాఫ్ట్‌వేర్ సామ్రాజ్యంలో వాటాలకు సంబంధించి జరుగుతున్న ఈ న్యాయపోరాటం.. ఇప్పుడు రూ.15వేల కోట్ల విలువైన బాండ్ల చుట్టూ తిరుగుతోంది. సామాన్యులకు సైతం ఆశ్చర్యం కలిగించే రీతిలో.. ఒక విజయవంతమైన బిజినెస్ మెన్ పర్సనల్ లైఫ్ అలాగే కంపెనీ ఆస్తుల మధ్య జరుగుతున్న ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అసలు వివాదంలోకి వెళితే..  శ్రీధర్ వెంబు తన వద్ద ఉన్న జోహో కంపెనీ షేర్లను తన భార్యకు తెలియకుండా రహస్యంగా తన బంధువులకు, ఇతరులకు ట్రాన్స్ ఫర్ చేశారని ప్రమీల ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కంపెనీలో ఆమెకు రావాల్సిన వాటాను దక్కనివ్వకుండా చేసేందుకే ఈ ఆర్థిక లావాదేవీలు జరిగాయని అమెరికా కోర్టులో వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు రూ.15వేల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు, బాండ్ల బదిలీ అంశం తెరపైకి వచ్చింది. ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా పేరున్న వీరి మధ్య.. ఇప్పుడు ఆస్తుల పంపకం, నమ్మకద్రోహం అనే అంశాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.

మరోవైపు శ్రీధర్ వెంబు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను ఎప్పుడూ తన భార్యకు లేదా తన కుమారుడికి అన్యాయం చేయలేదని కేవలం తనపై బురదజల్లేందుకే ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వాదిస్తున్నారు. తన సోదరులు, ఇతర కుటుంబ సభ్యులకు షేర్ల బదిలీ అనేది చట్టబద్ధంగానే జరిగిందని ఆయన సమర్థించుకుంటున్నారు. కంపెనీ ఎదుగుదల కోసం తీసుకున్న నిర్ణయాలను వ్యక్తిగత కక్షలకు వాడుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ గొడవ వల్ల జోహో వంటి ప్రతిష్టాత్మక కంపెనీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

►ALSO READ | ఇన్వెస్టర్లకు హెచ్చరిక: 5 ఏళ్లుగా మంచి లాభాలు సంపాదించారా..? అయితే మునిగిపోతారు జాగ్రత్త

ప్రస్తుతం ఈ కేసు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో విచారణలో ఉంది. ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుడి భవిష్యత్తు కోసం తాను పోరాడుతున్నానని ప్రమీల చెబుతుండగా.. ఇది కేవలం డబ్బు కోసం జరుగుతున్న డ్రామా అని వెంబు వర్గం కొట్టిపారేస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు. ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడి వ్యక్తిగత జీవితం కంపెనీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి ఈ వివాదం ఒక నిదర్శనంగా నిలిచింది. రూ.15వేల కోట్ల 'బాండ్' వివాదం చివరకు ఎటు వైపు మలుపు తిరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.