భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లను వెంటాడుతున్న అంశాలు ఇవే..

భారీ నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లను వెంటాడుతున్న అంశాలు ఇవే..

బుధవారం లాభాల్లో స్టార్ట్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు కొద్ది సేపట్లోనే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం సమయం నాటికి ఏకంగా బెంచ్ మార్క్ సూచీ 1000 పాయింట్ల నష్టంలోకి వచ్చేసింది. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ రంగాలు నష్టాల్లోకి జారుకోవటంతో దిగ్గజ బ్యాంకింగ్ స్టాక్స్ 1 శాతం మేర పతనం అయ్యాయి.

11.48 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 956 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుండగా.. నిఫ్టీ సూచీ 265 పాయింట్ల నష్టంతో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీనికి తోడు బ్యాంక్ నిఫ్టీ సూచీ 880 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 200 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. అసలు దేశీయ స్టాక్ మార్కెట్లను నష్టాల సునామీలోకి నెట్టిన కీలక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారత మార్కెట్లను ప్రస్తుతం వేధిస్తున్న అతిపెద్ద సమస్య విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల సెల్లింగ్. వారు మన మార్కెట్లలోని పెట్టుబడులను విక్రయిస్తూ డబ్బును వెనక్కి తీసుకోవటం సూచీలపై ఒత్తిడిని పెంచేస్తోంది. మార్చి 10న ఎఫ్ఐఐలు ఏకంగా రూ.4వేల 673 కోట్లు విలువైన పెట్టుబడులను అమ్మేశారు. దీనిని తట్టుకునే స్థాయిలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు డబ్బు కుమ్మరిస్తున్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు నమ్మకాన్ని కోల్పోవటం సెంటిమెంట్లను దెబ్బతీస్తోందని నిపుణులు చెబుతున్నారు. 

ఇక మార్కెట్ల అస్థిరతల వేళ చాలా మంది చిన్న పెద్దా పెట్టుబడిదారులు లాభాల స్వీకరణతో విక్రయాలు చేపడుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, ఆటో రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు భారీగా పెరిగి మార్కెట్లు చిత్తయ్యాయి. ప్రధానంగా క్రూడ్ దిగుమతులపై కొనసాగుతున్న అనిశ్చితి వాతావరణంతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.