హైదరాబాద్ హోటళ్లకు గ్యాస్ కష్టాలు.. షాగౌస్ హోటల్లో రెండు రోజులుగా కట్టెల పొయ్యి పైనే వంటలు

హైదరాబాద్ హోటళ్లకు గ్యాస్ కష్టాలు.. షాగౌస్ హోటల్లో రెండు రోజులుగా కట్టెల పొయ్యి పైనే వంటలు

హైదరాబాద్: హైదరాబాద్ హోటళ్లలో గ్యాస్ కష్టాలు తీవ్రతరం అయ్యాయి. గ్యాస్ కొరతతో  కట్టెల పొయ్యిలపై హోటల్స్ బిర్యానీ వండుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా గ్యాస్ లేక.. ప్రముఖ షాగౌస్ హోటల్లో రెండు రోజులుగా  కట్టెల పొయ్యిపైనే వంటలు వండుతున్నారు. ఇరాన్ యుద్ధం హోటల్, రెస్టారెంట్ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. 

పశ్చిమాసియాలో ఘర్షణలతో గల్ఫ్​దేశాల నుంచి చమురు, గ్యాస్​సరఫరా తగ్గిపోవడంతో కేంద్రం కమర్షియల్ ఎల్‌‌‌‌పీజీ సిలిండర్ల సరఫరాలో కోతలు పెడ్తున్నది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్​సప్లై నిలిపివేయడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే ప్రమాదం నెలకొన్నది. రాష్ట్రంలో నెలకు 8 లక్షల కమర్షియల్​సిలిండర్లు వినియోగిస్తుండగా.. సుమారు రూ.150 కోట్ల మార్కెట్‌‌‌‌ ఉంది.

కమర్షియల్ సిలిండర్ నిల్వలు తగ్గుముఖం పట్టడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు గ్యాస్ కష్టాలు షురూ అయ్యాయి. హైదరాబాద్‌‌‌‌లోని పలు రెస్టారెంట్లు మెనూకు పరిమితులు పెట్టుకుంటూ గ్యాస్​వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల సరఫరా మెరుగుపడకపోతే మరో రెండు రోజుల్లో చాలా హోటళ్లు మూతపడి.. ఈ​ రంగంపైనే ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.

తాజా పరిస్థితులపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌‌‌‌లో అత్యవసర సమావేశం నిర్వహించి.. గ్యాస్​సప్లై మెరుగుపడకపోతే హోటల్స్​ బంద్​చేయాలన్న యోచనలో ఉన్నట్టు హోటల్, రెస్టారెంట్ సంఘాలు ప్రకటించడం గమనార్హం.