హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోస్తున్న నీటిని కాళేశ్వరం నీళ్లంటూ బీఆర్ఎస్నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్మించిన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచే ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందుతున్నాయని తెలిపారు.
మూడేండ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్కా నీరు విడుదల కాకపోయినా అధిక వరి దిగుబడులతో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని చెప్పారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబ ధన దాహాన్ని తీర్చింది తప్ప ఒక్క గుంటకూ సాగునీరు అందించలేకపోయిందని ఫైర్అయ్యారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని ఒప్పుకొని తెలంగాణ రైతాంగానికి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
