ఇన్వెస్టర్లకు హెచ్చరిక: 5 ఏళ్లుగా మంచి లాభాలు సంపాదించారా..? అయితే మునిగిపోతారు జాగ్రత్త

ఇన్వెస్టర్లకు హెచ్చరిక: 5 ఏళ్లుగా మంచి లాభాలు సంపాదించారా..? అయితే మునిగిపోతారు జాగ్రత్త

జీవితంలో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే.. ఆ వచ్చిన డబ్బును నిలబెట్టుకోవడం మరో పెద్ద పని. ప్రపంచంలో చాలా మంది డబ్బు సంపాదిస్తారు కానీ కొందరి వద్దే అది నిలబడటానికి కారణం దాన్ని వృద్ధి చేసే అలాగే హోల్డ్ చేసే టాలెంట్ చాలా మంది వద్ద లేకపోవటమే. 

చాలా మందికి ఆర్థిక రంగంలో కొన్ని ఏళ్ల అనుభవం రాగానే తాము అంతా నేర్చేసుకున్నామనే అతివిశ్వాసం మొదలవుతుంది. సరిగ్గా ఇదే పాయింట్ వద్ద ఇన్వెస్టర్లు తమ జీవితంలో అతిపెద్ద ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేస్తుంటారని అన్నారు జాక్టర్ మనీ వ్యవస్థాపకులైన సీఏ అభిషేక్ వాలియా. 5 ఏళ్ల పాటు వరుసగా లాభాలు రావడం లేదా ఆదాయం పెరగడం అనేది ఒక ఇన్వెస్టర్‌కు అత్యంత ప్రమాదకరమైన సమయమని సీఏ హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా ఒక వ్యక్తి ఐదేళ్ల పాటు మార్కెట్లో మంచి రాబడిని చూసినప్పుడు.. తన నిర్ణయాలన్నీ సరైనవేనని బలంగా నమ్ముతుంటాడు. మార్కెట్ పరిస్థితులు అనుకూలించడం వల్ల వచ్చిన లాభాలను తన మేధస్సు వల్ల వచ్చినవిగా భావించడం ఇక్కడే మొదలవుతుంది. ఈ దశలో ఇన్వెస్టర్లు తమ శక్తికి మించి రిస్క్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఆదాయం స్థిరంగా పెరుగుతోంది కదా అన్న ధీమాతో భారీగా అప్పులు చేయడం, లగ్జరీ వస్తువుల కోసం ఖర్చు చేయడం లేదా అత్యంత రిస్క్ ఉన్న పథకాల్లో భారీగా పెట్టుబడి పెట్టడం వంటివి చేస్తుంటారని సీఏ హెచ్చరించారు. భవిష్యత్తు కూడా గడిచిన ఐదేళ్లలాగే సాఫీగా సాగుతుందని వారు భ్రమపడి ఆర్థిక చిక్కుల్లో ఇరుక్కుంటుంటారని అన్నారు.

కానీ ఫైనాన్షియల్ మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో పయనించవని ఇన్వెస్టర్లు గురించారన్నారు సీఏ. మార్కెట్ సైకిల్ మారినప్పుడు లేదా ఆదాయ వనరులు తగ్గినప్పుడు, అప్పటివరకు సౌకర్యవంతంగా అనిపించిన అప్పులే భారంగా మారుతాయన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో చేసిన పెట్టుబడులు నష్టాలను మిగిల్చినప్పుడు ఇన్వెస్టర్లు కోలుకోలేని దెబ్బ తింటారని పేర్కొన్నారు. ఐదేళ్ల విజయం వచ్చే ఇరవై ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించలేదని చాలా మంది ఆలస్యంగా గుర్తిస్తారని.. ముఖ్యంగా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియో అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు మార్కెట్ కరెక్షన్ కు లోనైతే ఆ షాక్‌ను తట్టుకునే కుషన్ లేకపోవడం వల్ల భారీగా నష్టపోతారని వివరించారు.

నిజమైన విజయవంతమైన ఇన్వెస్టర్లు భిన్నంగా ఆలోచిస్తారని అభిషేక్ వాలియా వివరిస్తున్నారు. విజయాన్ని చూసి పొంగిపోరు, అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ తో అప్పులు పెంచుకోరని చెప్పారు. మార్కెట్లు ఎంత లాభాలను ఇస్తున్నప్పటికీ వారి ప్రవర్తన మాత్రం చాలా కన్జర్వేటివ్ గానే ఉంటుందన్నారు. వారు ఎప్పుడూ అనుకోని పరిస్థితులకు సిద్ధంగానే ఉంటారన్నారు. ఆర్థిక రంగంలో 'వినయం' అనేది మెుమెంటం కంటే ఎక్కువ కాలం నిలుస్తుందని తేల్చి చెప్పారు. వేగం ఎప్పుడైనా ఆగిపోవచ్చు.. కానీ వినయం ఉన్న ఇన్వెస్టర్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనప్పుడు పానిక్ అవ్వకుండా.. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు స్థిరంగా పయనించగలడన్నారు. 

ఐదేళ్ల విజయం మీకు పాఠాలు నేర్పవచ్చు, కానీ అంతా నేర్చేసుకున్నామనే భ్రమలో ఉంటే మాత్రం అది భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుందని ఇన్వెస్టర్ల మైండ్ సెట్ మిస్టేక్స్ వల్ల నష్టపోతున్న తీరు గురించి చెప్పారు సీఏ అభిషేక్ వాలియా.