ఎవరికీ ఇచ్చింది వాళ్లకే.. షేర్ చేసుకోలేరు: ట్రంప్ పుండు మీద కారం చల్లుతోన్న నోబెల్ కమిటీ..!

ఎవరికీ ఇచ్చింది వాళ్లకే.. షేర్ చేసుకోలేరు: ట్రంప్ పుండు మీద కారం చల్లుతోన్న నోబెల్ కమిటీ..!

వాషింగ్టన్: వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో 2025 నోబెల్ శాంతి బహుమతిని గెల్చుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డును ఆమె అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‎కు అంకితం చేశారు. ఈ క్రమంలో వచ్చే వారం అమెరికా పర్యటనకు వెళ్తోన్న మచాడో నోబెల్ బహుమతిని ట్రంప్‎కి ఇచ్చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై నార్వేజియన్ నోబెల్ కమిటీ రియాక్ట్ అయ్యింది. 

నోబెల్ బహుమతిని ఇతరులతో పంచుకోవడం, బదిలీ చేయడం కానీ చేయలేమని స్పష్టం చేసింది. అలాగే నోబెల్ ఫ్రైజ్‎ను రద్దు కూడా చేయలేమని కుండబద్దలు కొట్టింది. నోబెల్ కమిటీ క్లారిటీతో నోబెల్ బహుమతిని ఇతరులతో షేర్ చేసుకోలేమనే విషయం తేటతెల్లమైంది. ఇదే ఇప్పుడు ట్రంప్‎కు పుండు మీద కారం చల్లినట్లైంది. ఎందుకంటే 2025 నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ గంపెడాశలు పెట్టుకున్నారు. 

తాను 8 యుద్ధాలు ఆపానని.. నోబెల్ పీస్ ఫ్రైజ్‎కు తాను అన్ని రకాల అర్హుడినని ఆయనకు ఆయనే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నారు. పాకిస్థాన్, ఇజ్రాయెల్ వంటి అమెరికా మిత్ర దేశాలు ట్రంప్‎కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫారసు కూడా చేశాయి. కానీ ఇవేవి పరిగణలోకి తీసుకుని నోబెల్ కమిటీ.. 2025 నోబెల్ పీస్ ఫ్రైజ్‎ను వెనిజులా ప్రతిపక్ష నేత కొరినా మచాడోకు ప్రదానం చేసింది. దీంతో ట్రంప్‎కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో తన అవార్డును ట్రంప్‎కు అంకితం చేస్తు్న్నట్లు ప్రకటించింది మచాడో. 

►ALSO READ | రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని కూడా వెనిజులా మదురోలా ఎత్తుకెళతారా..? ట్రంప్ కీలక కామెంట్స్..

దీంతో బాధలో ఉన్న ట్రంప్‎కు ఈ వార్త కాస్తా ఉపశమనం కల్పించింది. ఇందులో భాగంగానే వచ్చే వారం అమెరికా సందర్శించినప్పుడు మచాడో తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలన్న ప్రతిపాదన గురించి చర్చిస్తానని ట్రంప్ శనివారం అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన గంటల్లోనే నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని ఇతరులతో పంచుకోవడం, బదిలీ చేయడం కానీ చేయలేమని.. అలాగే నోబెల్ ఫ్రైజ్‎ను రద్దు కూడా చేయలేమని క్లారిటీ ఇచ్చింది. నోబెల్ కమిటీ వివరణతో ట్రంప్ కు కాస్తా సంతోషం కూడా లేకుండా పోయింది.