- పక్కా నిఘాతో మెక్సికన్ డ్రగ్ లార్డ్ను తుదముట్టించిన సైన్యం
- దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు
మెక్సికో సిటీ: ఏండ్ల తరబడి కొరకరానికొయ్యలా మారిన డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచోను మెక్సికో బలగాలు ఎట్టకేలకు తుదముట్టించాయి. అతడి గర్ల్ ఫ్రెండ్పై నిఘా పెట్టి, ట్రాక్ చేయడం ద్వారా ఆచూకీ గుర్తించారు. మెక్సికోలోని జాలెస్కో స్టేట్ తపాల్పా ప్రాంతంలో ఎల్ మెంచోను అదుపులోకి తీసుకోవడానికి చేపట్టిన ఆపరేషన్ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం.. జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్(సీజెన్ జీ)ను నడుపుతున్న మెంచో కోసం మెక్సికో, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు ఎప్పటి నుంచో గాలిస్తున్నాయి.
తాజాగా, మెంచోకు అత్యంత సన్నిహితురాలైన ఒక మహిళను, ఆమె అనుచరుడిని సైనిక దర్యాప్తు సంస్థలు వెంబడించడం ప్రారంభించాయి. శుక్రవారం నాడు సదరు మహిళ మెంచోను కలవడానికి జాలిస్కోలోని తపాల్పా ప్రాంతానికి వెళ్ళింది. అమెరికా ఇంటెలిజెన్స్ అందించిన పక్కా సమాచారంతో మెంచో అక్కడే ఉన్నాడని నిర్ధారించుకున్న సైన్యం, ఆ మహిళ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాడికి వ్యూహం రచించింది. ఆదివారం తెల్లవారుజామున ఆరు హెలికాప్టర్లు, ప్రత్యేక దళాలతో సైన్యం మెంచో స్థావరాన్ని చుట్టుముట్టింది.
ఈ క్రమంలో కార్టెల్ ముఠా సభ్యులు రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చివరకు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ పొదల్లో దాక్కున్న మెంచోను, అతని ఇద్దరు బాడీగార్డులను సైన్యం పట్టుకుంది. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎల్మెంచోను మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు.
డ్రగ్ కార్టెల్ ప్రతీకార దాడులు..
మెంచో కుడిభుజంగా భావించే 'ఎల్ తులి' అనే వ్యక్తి ఒక్కో సైనికుడిని చంపితే 20,000 పెసోలు (సుమారు రూ. లక్ష) ఇస్తామని గ్యాంగ్‌స్టర్లకు ఆశ చూపాడు. అయితే సైన్యం అతడిని కూడా మట్టుబెట్టి, 1.4 మిలియన్ డాలర్ల నగదును, పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. మెంచో మరణ వార్త తెలిసిన తర్వాత మెక్సికోలోని 32 రాష్ట్రాలలో 20 రాష్ట్రాల్లో హింస చెలరేగింది. కార్టెల్ సభ్యులు బస్సులు, వ్యాపార సంస్థలను తగులబెట్టారు. దేశవ్యాప్తంగా 250కి పైగా రహదారులను దిగ్బంధించారు. మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన డ్రగ్ సామ్రాజ్యాన్ని నడిపిన మెంచో అంతం కావడంతో, ఆ దేశంలో భద్రతా పరంగా టెన్షన్ ఉద్రిక్తత నెలకొంది.
