ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వి. వెంకటాయపాలెం సమీపంలోని 60 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకోవాలని కోర్టు ఉత్తర్వులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ నివాసాలు ఏర్పరచుకున్న గుడిసెలను ఫిబ్రవరి 24న ఉదయం జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు.
అయతే కొన్నినెలలుగా తాము ఇక్కడే నివాసాలు ఏర్పరుచుకున్నామని ఇపుడు ఎక్కడికి వెళ్లాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఖాళీ చేయడానికి గడువు ఇవ్వాలని కోరుతున్నారు. ఖాళీ చేయాల్సిందేనని అధికారులు పట్టుబడుతున్నారు. పోలీసులు భారీగా మొహరించడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
గత కొన్నేళ్ళుగా ఈ 60 ఎకరాల భూధాన్ భూమిపై వివాదం కొనసాగుతోంది. కోర్టు ఉత్తర్వులతో స్వాధీనం చేసుకునేందుకు ఇవాళ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఈ ఈ భూముల్లో సుమారు 600 మంది నివాసం ఉంటున్నారు. కొందరు శాశ్వత నిర్మాణాలు చేపట్టారు, మరి కొందరు తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టుకున్నారు. ఇవాళ అధికార యంత్రాంగం, వెయ్యి మందికి పైగా పోలీసులు భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తోంది. జేసీబీలతో గుడిసెలను తొలగిస్తోంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఖాళీ చేయిస్తున్నామని చెబుతున్నారు అధికారులు.
ఇన్నేళ్లుగా ఇక్కడే ఉన్న తాము ఎక్కడికి వెళ్లాలని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము ఖాళీ చేస్తే అధికార బలంతో ఈ భూమిని కబ్జా చేయాలని కొందరు పెద్దలు భావిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
