ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి :డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం టౌన్​, వెలుగు: ఎల్‌‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌‌లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టితో కలిసి ఎల్‌‌నినో పరిస్థితులపై ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జులై 15 నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 35 శాతం వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రస్తుతం రైతులు అధికంగా పత్తి సాగు చేశారని, వర్షాలు కురిస్తే వరి సాగు చేయాలనే ఆలోచనలో ఉన్నారని వివరించారు. ఎల్‌‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి పారుదల, ప్రణాళిక, వ్యవసాయం, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేసి ముందస్తు కార్యాచరణ అమలు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.

జిల్లాలో నమోదైన వర్షపాతం లోటు, దాని ప్రభావంపై ప్రతి రైతుకు స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి జలాలను ఖమ్మం జిల్లా అవసరాలకు వినియోగించుకోవడానికి సాంకేతిక అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ నీటి లభ్యత ఆధారంగానే రైతులు పంటలను ఎంపిక చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నీటి సమస్య మరింత తీవ్రం కావచ్చని, బోర్ల ఆధారంగా వరి సాగు చేస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.

భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాధ్యమైనన్ని ప్రాంతాల్లో గోదావరి బ్యాక్‌‌వాటర్‌‌ను ఎత్తిపోసి చెరువులను నింపేందుకు అవసరమైన మోటర్లు, విద్యుత్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఇంజినీర్లకు సూచించారు. ప్రస్తుతం వైరా, లంకాసాగర్ జలాశయాలను తాగునీటి అవసరాల కోసమే నింపుతున్నామని, పాలేరు జలాశయంలో కూడా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మాత్రమే తాగునీటి నిల్వలు ఉండే అవకాశం ఉందని చెప్పారు. రాజీవ్ లింక్ కాలువ ద్వారా గోదావరి నీటిని పాలేరు జలాశయానికి తరలించే అవకాశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాబోయే మూడు నెలల పరిస్థితులకే కాకుండా కనీసం ఏడాది కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రతి మండలంలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి సమాచారాన్ని రైతులకు అందించాలని తెలిపారు. సమావేశంలో ఖమ్మం కలెక్టర్ దివాకర, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.