భద్రాచలం, వెలుగు: జాతీయ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాచలానికి చెందిన రిటైర్డ్ ఎస్‌బీఐ అధికారి డీవీ శంకర్‌రావు(73) నాలుగు రజత పతకాలు సాధించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్(ఔరంగాబాద్)లోని గార్ఖేడా స్టేడియంలో జరుగుతున్న నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ అండ్ ఎక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో ఆయన ప్రతిభ చాటారు.
వివిధ విభాగాల్లో మూడు, ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో మరో రజత పతకాన్ని గెలుచుకుని మొత్తం నాలుగు రజతాలను సొంతం చేసుకున్నారు. ఇంతకుముందు కేరళలోని కోజీకోడ్, హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లోనూ పతకాలు సాధించిన శంకర్‌రావు, వరుసగా మూడోసారి నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడం విశేషం. 73 ఏళ్ల వయసులోనూ జాతీయ స్థాయిలో సత్తా చాటడం గమనార్హం.
