కొణిజర్ల: రికార్డుల్లో పేర్లు లేక ఎరువులకు దూరం

కొణిజర్ల: రికార్డుల్లో పేర్లు లేక ఎరువులకు దూరం

కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా సింగరాయపాలెం రెవెన్యూ పరిధిలోని సుమారు 400 ఎకరాల జాగీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ధారీ భూములు సాగు చేస్తున్న 200 నుంచి 220 మంది చిన్న, సన్నకారు రైతులు ధరణి రికార్డుల్లో పేర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారానే యూరియా విక్రయాలు నిర్వహిస్తుండటంతో యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్లు కనిపించక ఎరువులు కొనుగోలు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పత్తి పంటకు వెంటనే యూరియా వేయాల్సిన పరిస్థితి ఉన్నా ఎరువులు అందడం లేదని చెబుతున్నారు. 

సింగరాయపాలెంతో పాటు గుబ్బగుర్తి, పెద్దగోపతి, తనికెళ్ల తదితర గ్రామాల్లోనూ ఇదే సమస్య ఉందని, మండలంలో సుమారు 1,500 నుంచి 2,000 ఎకరాలు ప్రభావితమవుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నెల 28 నుంచి డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను కూడా యాప్ ద్వారానే అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రాప్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రత్యేకంగా పూర్తి చేసి, గ్రామస్థాయి లేదా వ్యవసాయ శాఖ ధృవీకరణ ఆధారంగా తాత్కాలికంగా ఎరువులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.