మోదీకి ధైర్యం ఉంటే.. అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలి

మోదీకి ధైర్యం ఉంటే..  అమెరికాతో ట్రేడ్ డీల్ రద్దు చేయాలి
  • లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్.. అమెరికా ప్రెజర్ వల్లే డీల్​ 
  • భోపాల్ లో ‘కిసాన్ మహాచౌపాల్’ ర్యాలీలో కాంగ్రెస్ నేత ఫైర్ 

భోపాల్: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి.. ఆ దేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లను ఆ దేశ సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో మోదీకి ధైర్యం ఉంటే ట్రేడ్ డీల్ ను రద్దు చేసుకోవాలని సవాల్ విసిరారు. 

మంగళవారం భోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన 'కిసాన్ మహాచౌపాల్' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. "ట్రంప్ విధించిన టారిఫ్ లను రద్దు చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రధాని మోదీకి ధైర్యం ఉంటే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి. కానీ ఆయన ఆ పని చేయలేరు" అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందానికి మోదీ ఆకస్మికంగా ఆమోదం తెలపడం వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయన్నారు. 

అమెరికా వద్ద ఉన్న దాదాపు30 లక్షల 'ఎప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టీన్ ఫైళ్ల'లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పేరు ఉందని, ఆ ఫైళ్ల ద్వారా అమెరికా మన ప్రధానిని బెదిరిస్తోందని ఆరోపించారు. తమ మాట వినకపోతే ఆ ఆధారాలను బయటపెడతామని అమెరికా హెచ్చరించడం వల్లే మోదీ లొంగిపోయారని విమర్శించారు. 

అలాగే, అమెరికాలో గౌతమ్ అదానీపై నడుస్తున్న క్రిమినల్ కేసు అసలు లక్ష్యం అదానీ కాదని, ప్రధాని మోదీయేనని రాహుల్ పేర్కొన్నారు. "ఈ రెండు కారణాలతో మోదీ చిక్కుల్లో పడ్డారు. ఇది వాణిజ్య ఒప్పందం కాదు, రైతుల గుండెల్లో గుచ్చిన బాణం. మంత్రులు రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీలకూ సమాచారం ఇవ్వకుండానే మోదీ సడెన్​గా ఈ నిర్ణయం తీసుకున్నారు" అని ఫైర్ అయ్యారు.

ఇంత పిరికి ప్రధానిని ఎన్నడూ చూడలే: ఖర్గే

కిసాన్ మహాచౌపాల్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.‘‘మోదీ ఒక పిరికిపంద. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని  సరెండర్ చేశారు. మన రైతులను బానిసత్వంలోకి నెట్టాలని మోదీ చూస్తున్నారు” అని విమర్శించారు. 

"60 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత పిరికి ప్రధానిని చూడలేదు. ఆయన ఎప్పుడూ మీడియా ముందుకు రారు, పార్లమెంటులో మాట్లాడరు. కేవలం 'మన్ కీ బాత్'తో సరిపెడతారు" అని ఎద్దేవా చేశారు. బ్రిటిష్ వారినే తరిమికొట్టిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మోదీ బెదిరించలేరని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు బ్రిటిష్ వాళ్లకు క్షమాపణ లేఖలు రాసిన వారు కాదని, అసలైన దేశభక్తులని ఖర్గే అన్నారు.