నేను ఎంతకాలం ఉంటనో తెల్వది..నన్ను చంపేందుకు గన్స్ పట్టుకొని తిరుగుతున్నారు: ట్రంప్

నేను ఎంతకాలం ఉంటనో తెల్వది..నన్ను చంపేందుకు గన్స్ పట్టుకొని తిరుగుతున్నారు: ట్రంప్
  • ప్రభావవంతమైన నాయకులపైనే 
  • దుండగులు దాడికి ప్రయత్నిస్తరు
  • తాను కూడా అలాంటి అధ్యక్షుడిని కాబట్టే 
  • దాడులు జరుగుతున్నయని వెల్లడి

వాషింగ్టన్: తనను తుదముట్టించాలని చాలా మంది చూస్తున్నారని..  తాను ఎంతకాలం ఉంటానో తెలియదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఫ్లోరిడాలోని ట్రంప్ మార్-ఎ-లాగో ఎస్టేట్​లోకి ఓ దుండగుడు షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గన్, పెట్రోల్ డబ్బాతో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంగళవారం ట్రంప్ స్పందించారు.  వైట్ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏంజెల్ ఫ్యామిలీస్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడుతూ.. “నేను ఎంతకాలం ఉంటానో తెలియదు. చాలా మంది నాపై గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దాడి చేయాలని చూస్తున్నారు. 

దుండగులు ప్రభావవంతమైన వ్యక్తులుగా భావించే నాయకులపైనే దృష్టి పెడతారు. మాజీ అధ్యక్షులు లింకన్, కెన్నెడీ కూడా అలాంటివారే. నేను కూడా ప్రభావవంతమైన అధ్యక్షుడిని కాబట్టి దాడులు జరుగుతున్నాయి. బహుశా నేను కొంచెం తక్కువ ప్రభావవంతంగా ఉండాలి. కొంచెం సాధారణ అధ్యక్షుడిగా ఉండిపోదాం” అంటూ చమత్కరించారు. అలాగే, తనపై దాడి చేసిన వారిని నేను ఎప్పుడూ మరచిపోనని పేర్కొన్నారు. గత ఆదివారం తెల్లవారుజామున 21 ఏండ్ల ఆస్టిన్ టకర్ మార్టిన్ అనే వ్యక్తి షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గన్, పెట్రోల్ క్యాన్​తో మార్-ఎ-లాగో ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నార్త్ గేట్ ద్వారా ప్రవేశించడానికి ప్రయత్నించాడు. 

సెక్యూరిటీ అధికారులు అతడిని లొంగిపోవాలని కోరగా.. అతడు తన ఆయుధాన్ని పైకి ఎత్తడంతో సీక్రెట్ సర్వీస్, షెరిఫ్ డిప్యూటీలు కాల్పులు జరిపి అతన్ని చంపేశారు. ఆ  సమయంలో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ఎస్టేట్​లో లేరు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ, సీక్రెట్ సర్వీస్, స్థానిక అధికారులు దుండగుడి మోటివ్, బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎంక్వైరీ చేస్తున్నారు. 

ఈ ఘటన అమెరికా అధ్యక్షులకు సంబంధించిన ప్రమాదాలను మరోసారి గుర్తుచేసింది. అమెరికా చరిత్రలో నలుగుగురు అధ్యక్షులు అబ్రహం లింకన్, జేమ్స్ గార్ఫీల్డ్, విలియం మెకిన్లీ, జాన్ ఎఫ్. కెన్నెడీ పదవిలో ఉండగా హత్యకు గురయ్యారు. ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై కూడా గతంలో రెండు సార్లు హత్యాయత్నాలు జరిగాయి.