మంచి రోజులు అయిపోయాయ్.. ఐటీ షేర్ల పతనంతో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ప్రకంపనలు

మంచి రోజులు అయిపోయాయ్.. ఐటీ షేర్ల పతనంతో రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ప్రకంపనలు

రియల్ ఎస్టేట్ రంగంలో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న గోల్డెన్ పీరియడ్ ముగిసిందా? ఏఐ దూకుడుతో ఐటీ రంగంలో వస్తున్న పెను మార్పులు రియల్ ఎస్టేట్ పునాదులను కదిలిస్తున్నాయా? తాజా స్టాక్ మార్కెట్ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశీయ టాప్ టెక్ కంపెనీల్లో స్టార్ట్ అయిన అమ్మకాల ఒత్తిడి రియల్టీ రంగాన్ని కూడా వణికిస్తోంది. దీంతో మంగళవారం మధ్యాహ్న సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 1.42 శాతం పడిపోవటంతో ఇన్వెస్టర్లలో ఆందోళన స్టార్ట్ అయ్యింది. 

ఐటీ సెగ.. రియాల్టీకి సెగ:
ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెస్తున్న విప్లవాత్మక మార్పులు ఐటీ కంపెనీల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ప్రధానంగా అమెరికాకు చెందిన ఆంత్రోపిక్ లాంటి ఏఐ సంస్థలు పాత సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్‌ను ఆధునీకరించడం ఇప్పుడు చాలా చౌకగా.. ఈజీగా మారిందని ప్రకటించడంతో సాంప్రదాయ ఐటీ సేవల కంపెనీల ఆదాయ మార్గాలకు గండి పడే అవకాశం కనిపిస్తోంది. ఐటీ రంగం కుదేలవడంతో.. ఆ ప్రభావం నేరుగా రియల్ ఎస్టేట్ డిమాండ్‌పై పడుతుందన్నది ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఐటీ ఉద్యోగులే రియల్ ఎస్టేట్ రంగానికి ప్రధాన కొనుగోలుదారులుగా ఇండియాలో ఉన్నారు కాబట్టి.

కుప్పకూలిన దిగ్గజ షేర్లు:
మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ రియల్టీలోని మొత్తం 10 కంపెనీల షేర్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. సిగ్నేచర్ గ్లోబల్ అత్యధికంగా 2.9 శాతం పడిపోగా, ప్రెస్టీజ్ ఎస్టేట్ 2.7 శాతం, గోద్రెజ్ ప్రాపర్టీస్ 1.9 శాతం మేర నష్టపోయాయి. ఇక ఆనంద్ రాజ్, బ్రిడ్జ్ ఎంటర్ ప్రైజెస్, సోభా, ఫోనిక్స్ మిల్స్, ఒబిరాయ్ రియల్టీ కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇండెక్స్ హెవీవెయిట్ DLF కూడా 1.1 శాతం పతనమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ దాదాపు 8.4 శాతం నష్టాన్ని నమోదు చేసింది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై ప్రభావం ఎంత?

దేశంలో బెంగళూరు తర్వాత ఐటీ రంగంపై అత్యధికంగా ఆధారపడిన నగరం హైదరాబాద్. సిటీలోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వృద్ధి కేవలం ఐటీ కంపెనీల విస్తరణ వల్లే ప్రధానంగా సాధ్యమైంది. ఐటీ కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఆఫీస్ స్పేస్‌లను తగ్గించుకుంటే.. హైదరాబాద్‌లోని భారీ కమర్షియల్ ప్రాజెక్టుల అద్దెలు, డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది.

ఇక రెసిడెన్షియల్ ప్రాపర్టీల విషయానికి వస్తే.. ఐటీ రంగంలో అనిశ్చితి ముదిరితే ఉద్యోగులు కొత్త ఇళ్లు కొనడానికి అలాగే ఇప్పటికే కొన్న ప్రాపర్టీలకు EMIలు కట్టడం కష్టంగా మారుతుంది. దీనివల్ల నగర శివార్లలో వెలుస్తున్న విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్‌ల అమ్మకాలు మందగించే అవకాశం ఉందని రియల్టీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఐటీ క్రాష్ నిజంగా సంభవిస్తే.. గత ఐదేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న ఊపు కొంత కాలంలోనే ఆవిరైపోవచ్చు. ఎకరం రూ.100 కోట్లు పలికిన ప్రదేశాలకు కూడా డిమాండ్ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని నిపుణుల అభిప్రాయం. రియల్ ఎస్టేట్ రంగంలో బెస్ట్ ఫేజ్ ఇప్పటికే ముగిసిపోయింది, ఇకపై ఆశించిన స్థాయిలో గ్రోత్ ఉండకపోవచ్చన్నది ఒప్పుకోవాల్సిన నిజం. ఉపాధి అవకాశాలనే ఏఐ కనుమరుగు చేస్తుంటే ప్రజలు ఇళ్లపై ఎలా ఇన్వెస్ట్ చేయగలరనే ప్రశ్న ఇప్పుడు వెంటాడుతోంది అందరినీ.

మొత్తానికి ఐటీ రంగంలోని ఏఐ ప్రకంపనలు దేశవ్యాప్తంగానే కాకుండా.. ముఖ్యంగా హైదరాబాద్ వంటి టెక్ హబ్‌లలో రియల్ ఎస్టేట్ బేస్‌ను కుదిపేస్తోంది. ఇన్వెస్టర్లు ఇప్పుడు ప్రాపర్టీల కంటే సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉండే రియల్టీలో డబ్బును లాక్ చేసుకోవటం కంటే లిక్విడ్ అసెట్స్ వైపు మెుగ్గుచూపుతున్నారని సమాచారం. ఇప్పటికే ఈఎంఐలు చెల్లిస్తున్న వారిలో కూడా జాబ్ ఇన్ సెక్యూరిటీ భయాలు పెరుగుతున్నాయట.