వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బంధించి.. విచారణ పేరుతో అమెరికాకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలోనూ అటువంటి సాహసోపేతమైన చర్య తీసుకునే అవకాశం ఉందా? రష్యా లాంటి దేశంపై ట్రంప్ ఇలాంటి ఆలోచన కలలో కూడా చేయగలరా అనే ప్రశ్నలు కూడా సోషల్ మాడియాలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రశ్నలకు ట్రంప్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
పుతిన్‌ను బంధించేందుకు ఎటువంటి ప్రత్యేక సైనిక చర్య అవసరం ఉంటుందని తాను అనుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో పుతిన్‌తో తనకు ఉన్న సంబంధాలను గుర్తు చేసుకుంటూ.. ఆయనతో నాకు ఎప్పుడూ మంచి సంబంధాలే ఉండేవి అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత రష్యా తీరుపై ఆయన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. పుతిన్ ప్రవర్తన నాకు చాలా నిరాశ కలిగించిందంటూనే.. పుతిన్‌ను పట్టుకోవాల్సిన అవసరం రాకపోవచ్చని ట్రంప్ అన్నారు. అమెరికా, రష్యాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కోల్డ్ వార్ తరహా పోటీ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
►ALSO READ | ఖమేనీ ఫోటోతో సిగరెట్ వెలిగించిన యువతి.. ఇరాన్ లేడీస్ ఎందుకిలా చేశారు.. ఆంతర్యం ఏమిటి..?
మరోవైపు.. వెనిజులాలో మదురో అధికారం కోల్పోయిన తర్వాత అక్కడి క్రూడ్ ఆయిల్ నిల్వలపై అమెరికా తన పట్టును బిగిస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌కు ఒక శుభవార్త వినిపించింది. అమెరికా నియంత్రణలో ఉండే కొత్త నిబంధనల ప్రకారం భారత్ మళ్లీ వెనిజులా నుంచి ముడి చమురును కొనుగోలు చేసేందుకు వాషింగ్టన్ అంగీకరించింది. భారత్ వంటి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకు ఇంధన అవసరాలు భారీగా ఉన్నాయని గుర్తించిన అమెరికా.. రష్యా నుంచి దిగుమతులకు దూరం చేసేందుకు ఈ వెసులుబాటు కల్పించిందని తెలుస్తోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని వైట్ హౌస్ అధికారులు స్పష్టం చేశారు.
అమెరికా ఇంధన శాఖ కార్యదర్శి క్రిస్టోఫర్ రైట్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ.. అమెరికా ప్రతిపాదించిన విధానం ప్రకారం దాదాపు అన్ని దేశాలకు వెనిజులా క్రూడ్ ఆయిల్ అమ్మటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల రష్యాపై చమురు కోసం ఆధారపడటం తగ్గుతుందని, భారత్ వంటి దేశాలకు ప్రత్యామ్నాయ మార్గం దొరుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలకు తాజా పరిస్థితులు నిదర్శనంగా మారాయి.
