చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం (ఫిబ్రవరి 27) సీఎం స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఏఐఏడీఎంకే నుంచి బహిష్కరించిన నేపథ్యంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన మూడు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రి గా పనిచేశారు. దివంగత జయలలితకు అత్యంత నమ్మకస్తుడు.
చైన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి కూడా పాల్గొన్నారు. 234 సభ్యుల తమిళనాడు శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ రాజకీయ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. పన్నీర్సెల్వం గతంలో జయలలితకు అత్యంత విశ్వసనీయ సహాయకుడిగా గుర్తింపు పొందారు. ఆమె మరణానంతరం అన్నాడీఎంకేలో చోటుచేసుకున్న అధికార పోరులో పళని స్వామి తో తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ విభేదాల నేపథ్యంలో పన్నీర్సెల్వాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆయన పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా ప్రచారం నిర్వహించారు.
ఇటీవల అన్నాడీఎంకేలో తిరిగి చేరేందుకు సిద్ధమని, పళనిస్వామి నాయకత్వాన్ని అంగీకరించేందుకు కూడా సిద్ధమేనని పన్నీర్ సెల్వం సంకేతాలిచ్చారు. అయితే ఆయన తిరిగి చేరికకు అన్నాడీఎంకే స్పష్టం గా నిరాకరించింది. ఈ క్రమంలో ఆయన డీఎంకేలో చేరడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డీఎంకేలో చేరిన తర్వాత పన్నీర్ సెల్వం వచ్చే ఎన్నికల్లో
బోడినాయకనూర్ నుంచి పోటీ చేసే అవకాశముందని సమాచారం. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఆయన లక్షకు పైగా ఓట్లతో విజయం సాధించారు. పన్నీర్ సెల్వం చేరికతో డీఎంకేకు రాజకీయంగా లాభం చేకూరే అవకాశం ఉందని విశ్లేషకు లు అంచనా వేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ పరిణామం తమిళనాడు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
మార్నింగ్ వాక్ మార్చేసిందా?
చెన్నై: ఒక సాధారణ మార్నింగ్ వాక్ తమిళ రాజకీయాలను ప్రభావితం చేసింది. ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అడయార్ థియోసాఫికల్ సొసైటీలో జరిగిన మార్నింగ్ వాక్ సందర్భంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తో జరిగిన భేటీ, ఎఐఏడీఎంకే నుంచి బహి ష్కరణకు గురైన ఓ పన్నీర్ సెల్వం రాజకీయ దిశను మార్చేసిందని తెలుస్తోంది. ఆ భేటీ అనంతరం ఆల్వార్పేట నివాసంలో జరిగిన మరో సమావేశం, అదే సమయంలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవ డం కీలక మలుపుగా మారినట్లు సమాచారం.
ఎఐ ఏడీఎంకేలో తిరిగి చేరేందుకు చేసిన ప్రయత్నాలను పార్టీ ప్రధాన కార్యదర్శి కె పళనిస్వామి వర్గం స్పష్టం గా తిరస్కరించడంతో ఆ మార్గం పూర్తిగా మూసుకు పోయింది. ఎన్డీఏలో కొనసాగేందుకు భారతీయ జనతా పార్టీ స్వతంత్ర సీటు ప్రతిపాదించినా, అధికారిక రాజకీయ పునరావాసం కావాలన్న లక్ష్యం తో ఓపీఎస్ దాన్ని అంగీకరించలేదని తెలిసింది. ఈ పరిణామాల క్రమంలో బ్యాక్ డోర్ చర్చలు వేగం పుంజుకుని చివరకు ద్రవిడ మున్నేట్ర కజగం వైపు దారి తీశాయని తెలుస్తోంది.
