నా కంటే జట్టే నన్ను ఎక్కువ నమ్మింది: వరుస వైఫ్యలాలపై అభి ఎమోషనల్

నా కంటే జట్టే నన్ను ఎక్కువ నమ్మింది: వరుస వైఫ్యలాలపై అభి ఎమోషనల్

టీ20 వరల్డ్ కప్‎లో వరుస వైఫల్యాలపై టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఎమోషనల్ అయ్యాడు. ‘‘ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న సమయంలో నాపై నా కంటే జట్టే ఎక్కువ నమ్మకం ఉంచింది.  కోచ్‌లు, సహచర ఆటగాళ్లు అందరూ మద్దతుగా నిలిచారు. ఒక కుటుంబ సభ్యుడిలా ట్రీట్ చేశారు. అది నన్ను భావోద్వేగానికి గురి చేసింది’’ అని భావోద్వేగానికి గురయ్యాడు.

భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్‎లో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ తీవ్రంగా నిరాశ పర్చాడు. బ్యాట్ పడితే  బౌండ్రీల వర్షం కురిపించే ఈ యువ ఓపెనర్ వరల్డ్ కప్ గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. అమెరికా, ఒమన్ వంటి పసికూన జట్లపైన పరుగులు చేయడానికి తంటాలు పడ్డాడు. 

ఓ వైపు మరో యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ పరుగుల వర్షం కురిపిస్తుంటే.. అభిషేక్ మాత్రం డకౌట్ల పరంపర కొనసాగించాడు. అభి వైఫల్యం జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో అభిషేక్‎ను జట్టు నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపించాయి. 

వరుసగా విఫలం అవుతున్నా సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా అతడినే ఎందుకు కొనసాగిస్తున్నారని బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సూపర్ 8లో భాగంగా జింబాబ్వేతో జరిగిన కీలకమైన మ్యాచులో అభిషేక్ తిరిగి పుంజుకున్నాడు. హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తనపై విమర్శలు చేస్తోన్న వాళ్ల నోళ్లు మూయించాడు.