- ఎప్‌సెట్ రద్దు.. ఇంటర్ మార్కులతోనే ఇంజినీరింగ్, అగ్రికల్చర్ సీట్లు
- టెన్త్, 12వ తరగతిలోనే పబ్లిక్ పరీక్షలు
- ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు
- సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ అందజేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
- సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్‌కేజీ ప్రారంభించాలి
- పీజీ వరకు ఇంగ్లిష్ మీడియంనే కొనసాగించాలి
- టీచర్ పోస్టుకు డిగ్రీ, బీఈడీ చదివి ఉండాల్సిందే
- డీఈడీ కోర్సును పూర్తిగా ఎత్తివేయాలి
- ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్
- బడ్జెట్‌లో విద్యకు 18% కేటాయించాలని కమిషన్ సిఫారసు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రూపురేఖలు మార్చేలా, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి కళ్లెం వేసేలా ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులు చేసింది. ఇంటర్మీడియెట్ వ్యవస్థను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేయాలని, విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్న టీజీ ఎప్‌సెట్‌ను రద్దు చేయాలని సూచించింది. అన్ని సర్కారు బడుల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ సెక్షన్లు ప్రారంభించాలని, పీజీ దాకా ఇంగ్లిష్ మీడియమే కొనసాగించాలని పేర్కొన్నది.
గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నేతృత్వంలో కమిషన్ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ‘తెలంగాణ విద్యా విధానం –2026’ నివేదికను అందజేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో వేలాది మంది ప్రజలు, విద్యావేత్తలు, టీచర్లు, విద్యార్థుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం ఈ నివేదికను రూపొందించినట్టు కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో తెలుగు/ ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ.. మూడు భాషల విధానాన్ని ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని కమిషన్ సూచించింది. సరిగా నడవని అన్ని ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, ఐఐటీలను, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చాలని పేర్కొన్నది.
మార్కుల ఆధారంగా ఇంజినీరింగ్ సీట్లు
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వ్యవస్థలో సమూల మార్పులు రావాలని కమిషన్ అభిప్రాయపడింది. ఇకపై ఇంటర్‌ను ప్రత్యేక విభాగంగా కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలిపేయాలని నివేదికలో సూచించింది. ఇంటర్‌ను స్కూల్లో 11, 12వ తరగతులుగా కొనసాగించాలని పేర్కొన్నది. విద్యార్థులపై తీవ్ర మానసిక ఒత్తిడి పెంచుతున్న ఎప్‌సెట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలని కమిషన్ ప్రతిపాదించింది.
దానికి బదులుగా 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రతి ఏటా పరీక్షల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా.. కేవలం 10, 12వ తరగతుల్లో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని, 11వ తరగతి బోర్డు పరీక్షను రద్దు చేయాలని సూచించింది.
సర్కారు బడుల్లో అడ్మిషన్లు పెంచేందుకు, కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దేందుకు అన్ని స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ (ప్రీ-ప్రైమరీ) క్లాసులు ప్రారంభించాలని కమిషన్ సూచించింది.నర్సరీ నుంచి పీజీ వరకు కచ్చితంగా ఇంగ్లిష్‌లోనే ఉండాలని తేల్చిచెప్పింది. ఊరికో చిన్నచిన్న బడులు కాకుండా అన్ని సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. దీంట్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులందరూ ఒకే ప్రాంగణంలో ఉంటారు.
ఇలాంటి స్కూళ్లను ఏటా 400 చొప్పున రాబోయే ఐదేండ్లలో రెండు వేల స్కూళ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నది. ఆయా స్కూళ్లలో 1,500 అడ్మిషన్లు కల్పించాలని సూచించింది. ఈ స్కూళ్లకు పిల్లలను రప్పించేందుకు బస్ సౌకర్యం కల్పించడంతోపాటు బ్రేక్ ఫాస్ట్, మిడ్డే మీల్స్, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని తెలిపింది.
పాస్ మార్కుల పెంపు
టీచర్ల అర్హతల్లోనూ కమిషన్ కీలక మార్పులు సూచించింది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సును పూర్తిగా ఎత్తేయాలని పేర్కొన్నది. టీచర్ పోస్టుకు పోటీ పడాలంటే డిగ్రీతో పాటు బీఈడీ కచ్చితంగా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. విద్యా ప్రమాణాలు పెంచే దిశగా.. స్కూల్, ఇంటర్ స్థాయిల్లో పాస్ మార్కులను ప్రస్తుతమున్న 35 శాతం నుంచి 45 శాతానికి పెంచాలని సూచించింది. అలాగే డిగ్రీ, పీజీ కోర్సుల్లో క్వాలిటీ పెంచేందుకు ఉత్తీర్ణత శాతాన్ని ఏకంగా 50 శాతానికి పెంచాలని సిఫారసు చేసింది. సర్కారు డిగ్రీ కాలేజీలను బలోపేతం చేయాలని, ప్రతి కాలేజీకి అనుబంధంగా 200 మంది కెపాసిటీతో ఒక సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నది.
ప్రైవేట్‌లో ఫీజులకు నియంత్రణ ఉండాలి
ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేలా కమిషన్ పలు సిఫార్సులు చేసింది. ప్రైవేట్ కాలేజీల్లో క్లాసులు నిర్వహించకుండా కేవలం కోచింగ్ ఇవ్వడాన్ని నిషేధించాలని పేర్కొంది. జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించేలా చట్టాల్లో సవరణలు చేయాలని సూచనలు చేసింది. ప్రైవేట్‌స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు చట్టబద్ధమైన ఫీజుల నియంత్రణ కమిషన్ ను ఏర్పాటు చేయాలని సిఫారస్చేసింది.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉన్న వసతులు, లొకేషన్ ఆధారంగా వాటిని 5 లేదా 6 రకాలుగా విభజించి, ఒక్కో వర్గానికి గరిష్ట ఫీజును ప్రభుత్వమే నిర్ణయించాలని, ఆ మేరకే యాజమాన్యాలు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే, కమిషన్ ఇప్పటికే తెలంగాణ ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీల ఫీజు నియంత్రణ మరియు పర్యవేక్షణ బిల్లు 2026 (ముసాయిదా) సిద్ధం చేసిన విషయాన్ని గుర్తుచేసింది.
వీసీలుగా ప్రొఫెసర్లే ఉండాలి
యూనివర్సిటీల వ్యవహారాల్లోనూ మార్పులు అవసరమని కమిషన్ భావించింది. యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్లుగా ఐఏఎస్ అధికారులను కాకుండా, అకడమిక్ రంగంలో అనుభవం ఉన్న ప్రొఫెసర్లనే నియమించాలని సూచించింది. మరోపక్క వర్సిటీ ఈసీలను పునర్ నిర్మించాలని పేర్కొన్నది. వీసీ చైర్మన్‌గా, రిజిస్ట్రార్, ఇద్దరు మాజీ వీసీలు, ఒక పారిశ్రామిక వేత్త, మాజీ ఐఏఎస్, సీనియర్ మోస్ట్ డీన్ లు, ప్రిన్సిపల్, కాలేజెట్ కమిషనరేట్ ఏడీ/జేడీలు సభ్యులుగా ఉండాలని సూచించింది.
వర్సిటీ వీసీల నియామకంలోనూ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, యూజీసీ నామిని, ముగ్గురు రిటైర్డ్ వీసీలతో సెర్చ్ కమిటీ ద్వారా ఎంపిక చేయాలని తెలిపింది. ఈసీ సమావేశాలన్నీ వర్సిటీ ప్రాంగణంలోనే నిర్వహించాలని, వర్సిటీ కీలక నిర్ణయాలను అధికార యంత్రాంగం నిర్దేశించొద్దని సూచించింది. వర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి, రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని పేర్కొన్నది.
18 శాతం నిధులు కేటాయించాలి
లింగ్డో కమిటీ సిఫారసుల మేరకు విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ సూచించింది. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని తెలిపింది. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి కనీసం 18 శాతం నిధులు కేటాయించాలని, అప్పుడే ప్రభుత్వ బడులు, కాలేజీల రూపురేఖలు మారుతాయని కమిషన్ స్పష్టం చేసింది. స్కూళ్లు, విద్యాసంస్థల ర్యాంకింగులు, విద్యార్థుల సామర్థ్య అంచనాల కోసం పనిచేసే స్వతంత్ర అత్యున్నత సంస్థ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్ట్స్ అథారిటీ (టేసా) ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది.
ఉచిత విద్యను మూడేండ్ల నుంచి 18 ఏండ్లు (నర్సరీ నుంచి ఇంటర్ వరకు) విస్తరించాలని సూచించింది. వర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీల అఫిలియేషన్ ప్రక్రియను పునర్ వ్యవస్థీకరించి, దానికోసం కంట్రోలర్ ఆఫ్ అఫిలియేషన్ ఆఫీసు ఏర్పాటు చేయాలని చెప్పింది.
టీచర్లకు ఆటోమేటిక్ ప్రమోషన్లు ఇవ్వొద్దు
టీచర్లకు ఆటోమేటిక్ ప్రమోషన్లు ఉండొద్దని కమిషన్ సూచించింది. వారి పనితీరు ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ డిస్ట్రిక్ట్ లను ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం మూడు చొప్పున.. ఇతర జిల్లాల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేయాలని సూచించింది. విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక వసతులను పర్యవేక్షించేందుకు ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ బోర్డులు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉండాలని సిఫారసు చేసింది.
మిడ్డే మీల్స్‌ను అన్ని సర్కారు జూనియర్ కాలేజీలకు విస్తరించాలని, అదనంగా రూ.50 కోట్లు కేటాయించాలని పేర్కొన్నది. బడుల్లో వంట చేసే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలని, మిడ్డే మీల్స్ అంచనాలు, ప్రపోజల్స్, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్ వేర్‌ను వాడాలని వెల్లడించింది.
కమిషన్ గుర్తించిన కొన్ని విషయాలు..
- సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో అడ్మిషన్లు 26 శాతమే
- రెండో తరగతి వాచకం చదవగలిగే మూడో తరగతి స్టూడెంట్స్ 6.3 శాతమే
- జీరో ఎన్రోల్మెంట్ బడులు 1920 (దేశంలో రెండో స్థానం)
- రాష్ట్రంలో 82 శాతం ప్రైమరీ స్కూళ్లలో మల్టీ గ్రేడ్ టీచింగ్
- 36 శాతం బడుల్లో ఒక్కరే టీచర్
- యూనివర్సిటీల్లో 80 శాతం
- టీచింగ్ పోస్టులు ఖాళీ
- రాష్ట్రంలో 13.9% కాలేజీలకే న్యాక్ గ్రేడ్
- ముఖ్యమైన సిఫారసులు 45% మార్కులొస్తేనే పాస్
- స్కూల్, ఇంటర్ స్థాయిల్లో పాస్ మార్కులను 35 శాతం నుంచి 45 శాతానికి పెంచాలి
- డిగ్రీ, పీజీ కోర్సుల్లో 50% మార్కులొస్తేనే ఉత్తీర్ణత
- టీచర్లకు ఆటోమేటిక్ ప్రమోషన్లు ఇవ్వొద్దు. పనితీరు ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలి
- యూనివర్సిటీల్లో వైస్ చాన్స్లర్లుగా ప్రొఫెసర్లనే నియమించాలి
- ప్రైవేట్ కాలేజీల్లో క్లాసులు చెప్పకుండా కోచింగ్ ఇవ్వడం నిషేధం
- ఐఐటీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చాలి
- కార్పొరేట్‌కు దీటుగా అన్ని స్కూళ్లలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు నిర్వహించాలి
