- అవగాహన లేక ఆసక్తి చూపని పలువురు రైతులు
- ప్రభుత్వ పథకాలకు తప్పనిసరి అంటున్న అధికారులు
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9,14,728 పట్టాదారు పాస్‌బుక్కులు
జనగామ, వెలుగు: రైతులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ చేపడుతోంది. ఇందులో భాగంగా సాగుభూమి ఉన్న వారికి 11 అంకెల యూనిక్‌ఐడీ ఇవ్వనున్నారు. ఈ నెల 28న నమోదు గడువు ముగియనుంది. అయితే, దీనిపై అవగాహన లేక పలువురు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫార్మర్రిజిస్ట్రీ ప్రక్రియ ప్రారంభమై ఏడాది కావొస్తున్నా ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్జిల్లాలో 65.29 శాతం మందే నమోదు చేసుకున్నారు.
యూనిక్ ఐడీ ఉంటేనే స్కీమ్స్
2026–-27 సంవత్సరం నుంచి యూనిక్‌ఐడీ ఉంటేనే వ్యవసాయానికి సంబంధించిన స్కీమ్స్ అందుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డు, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, యాంత్రిక పరికరాల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు, విత్తన సబ్సిడీ, పంట నష్ట పరిహారం, పంటల బీమా వంటి ప్రయోజనాలు పొందేందుకు ఇదే ప్రామాణికం కానుందని అంటున్నారు.
భవిష్యత్ లో ఇతర రైతు సంక్షేమ, వ్యవసాయ పథకాలే కాకుండా ఎరువులు, పంట ఉత్పత్తుల విక్రయాల విషయంలో ఫార్మర్ రిజిస్ట్రీ గుర్తింపు సంఖ్యను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని
పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు 5,97,254 మంది..
ఉమ్మడి జిల్లాలో పట్టాదారు పాస్‌బుక్కులు(పీపీబీ) 9,14,728 ఉన్నాయి. వ్యవసాయాన్ని డిజిటలైజేషన్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్గతేడాది వానాకాలం సీజన్ నుంచి ఫార్మర్రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించింది. దీనిపై మొదట్లో సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో మీసేవలో కూడా రిజిస్ట్రీ చేయించుకునే వెసులుబాటు కల్పించింది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 5,97,254(65.29 శాతం) పట్టాదారులు రిజిస్ట్రీ చేయించుకున్నారు. ములుగు జిల్లాలో తక్కువగా 58.55 శాతం, వరంగల్జిల్లాలో అత్యధికంగా 70.18 శాతం మంది రైతులు నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రీకి శుక్ర, శని రెండు రోజుల సమయమే ఉండటంతో ఈ ప్రక్రియ వందశాతం పూర్తయ్యే అవకాశం లేదు.
ఉమ్మడి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ వివరాలు
జిల్లా పాస్‌బుక్స్ రిజిస్ట్రీ శాతం
వరంగల్ 1,56,296 1,09,682 70.18
జనగామ 1,89,459 1,30,837 69.06
హన్మకొండ 1,52,220 1,03,344 67.89
భూపాలపల్లి 1,21,721 77,362 63.56
మహ-బాద్ 2,12,827 1,27,900 60.10
ములుగు 82,205 48,129 58,55
మొత్తం 9,14,728 5,97,254 65.29
