చాలా కాలంగా వార్నర్ బ్రదర్స్ కంపెనీని సొంతం చేసుకోవడానికి జరుగుతున్న పోరాటంలో కీలక మలుపు తిరిగింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ రేసు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో పారామౌంట్ స్కైడాన్స్ విజేతగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. అయితే పారామౌంట్ పెట్టిన భారీ ఆఫర్‌తో పోటీ పడటం అంతగా లాభం కాదని నెట్‌ఫ్లిక్స్ భావించింది. ఈ ప్రటకటన తరువాత నెట్‌ఫ్లిక్స్ షేర్లు 10% పైగా పెరిగాయి.
వార్నర్ బ్రదర్స్ కోసం జరిగిన వేలంలో పారామౌంట్ ఒక్కో షేరుకు 31 డాలర్లు, నెట్‌ఫ్లిక్స్ ఒక్కో షేరుకు 27.75 డాలర్లుతో పోటీపడ్డాయి. పారామౌంట్ ఆఫర్‌ను పెంచడమే కాకుండా, నగదు రూపంలో ఎక్కువ చెల్లించడానికి ముందుకు రావడంతో వార్నర్ బ్రదర్స్ బోర్డు పారామౌంట్ వైపు మొగ్గు చూపింది.
ఈ విలీనం జరిగితే ప్రపంచవ్యాప్తంగా వినోద రంగంలో ఒక కొత్త శకం మొదలవుతుంది. అంతేకాకుండా పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ లాంటి రెండు పెద్ద స్టూడియోలు ఒకటవుతాయి. దింతో స్ట్రీమింగ్ సేవలైన HBO Max, Paramount+ సేవలు కలిసిపోతాయి. అలాగే వార్తా సంస్థలైన CNN, CBS వంటి దిగ్గజ నెట్‌వర్క్‌లు ఒకే చోటుకి వస్తాయి.
కానీ ఈ డీల్ అంత సులభంగా ముగిసేలా లేదు. అమెరికా, ఇతర దేశాల్లోని ప్రభుత్వ సంస్థలు ఈ విలీనాన్ని పరిశీలిస్తాయి. అలాగే మార్కెట్లో పోటీని తగ్గిస్తుందేమోనన్న భయం కూడా ఉంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఈ డీల్ విఫలమైతే, పారామౌంట్ సుమారు 7 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి పారామౌంట్ స్కైడాన్స్ ముందుంది. లారీ ఎల్లిసన్ వంటి బిలియనీర్ల మద్దతుతో పారామౌంట్ భారీ నిధులను సిద్ధం చేసింది. అయితే, చివరి నిమిషంలో బోర్డు నిర్ణయం, ప్రభుత్వ అనుమతులపైనే ఈ డీల్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
