ఖమేనీ ఫోటోతో సిగరెట్ వెలిగించిన యువతి.. ఇరాన్ లేడీస్ ఎందుకిలా చేశారు.. ఆంతర్యం ఏమిటి..?

ఖమేనీ ఫోటోతో సిగరెట్ వెలిగించిన యువతి.. ఇరాన్ లేడీస్ ఎందుకిలా చేశారు.. ఆంతర్యం ఏమిటి..?

ఇరాన్ లో నిరసనలు 13 రోజులకు చేరుకున్నాయి. ఈ ఆందోళనల్లో ఒక యువతి.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫోటో కాలిపోతుండగా.. ఆ మంటతో సిగరెట్ అంటించుకోవడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హిజాబ్ (బురఖా) లేకుండా బయటకు రావద్దనే కఠిన నిబంధనలున్న దేశంలో.. స్కర్టులు, మిడ్డీలు వేసుకుని.. నిరసనల్లో పాల్గొనడం... కొన్ని ఏళ్లుగా ఉన్న సిగరెట్ నిషేధాన్ని కాదని.. ఏకంగా సుప్రీం లీడర్ ఫోటోతో సిగరెట్ అంటించుకోవడంపై చర్చ జరుగుతోంది. అక్కడి మహిళలు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు..? అనేలా ఇప్పుడు డిబేట్ నడుస్తోంది. 

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. రోడ్లపై నిలిచింది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న కరెన్సీ విలువ, విదేశీ మారకం నిల్వలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ అక్కడ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి.

ఇరాన్ లో సుప్రీం లీడర్ ఫోటోను కాల్చడం అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరం. అది కూడా ఫోటోతో సిగరేట్ అంటించుకోవడం ఆ చట్టాల ప్రకారం క్షమించరాని నేరం. అయితే ఈ చర్య ద్వారా మహిళలు ప్రభుత్వానికి, భవిష్యత్ నాయకులకు స్పష్టమైన మెసేజ్ పంపినట్లు స్పష్టమవుతోంది. అక్కడి పురాతన చట్టాలను ధిక్కరిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై ఇస్లాం చట్టాలు విధిస్తున్న నిర్బంధాల గోడలను కూల్చేస్తున్నామని వాళ్లు.. అంత డేర్ గా.. అంత ధైర్యంగా.. తెగింపుతో ఈ విధంగా నిరసనలకు దిగారు.

ఇరాన్ లో ఇంతటి నిరసనలకు 2022 ఘటన కూడా ఒక కారణం. ఇరాన్ రాజ కుటుంబీకుడు మాష అమిని పోలీస్ కస్టడీలో చనిపోవడంతో అప్పటి నుంచి అక్కడ అప్పుడప్పుడు నిరసన జ్వాలలు అంటుకుంటూనే ఉన్నాయి. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను, నిరసనలు అణచివేస్తూ వస్తోంది అక్కడి ప్రభుత్వం. అప్పట్నుంచి ఆన్ లైన్ లో.. నిశ్చబ్ద ప్రచారం జరుగుతూనే ఉంది. 

అయితే ఇరాన్ లో నిరసనలు మిన్నంటిన వేళ.. సుప్రీం లీడర్ కు వ్యతిరేకంగా చేసే చర్యలను ఉపేక్షించేది లేదని అధికార వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. మహిళలు తిరస్కార ధోరణిలో ఇలాంటి చర్యలకు దిగటం.. మహిళలపై అణచివేతను ఎప్పటికీ సహించేది లేదని వాదనను బలంగా వినిపిస్తున్నట్లు ప్రపంచానికి సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది. 

రోజు రోజుకూ దిగజారుతున్న ఇరాన్ పరిస్థితి:

ఇరాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి. ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ దారుణంగా పతనమైంది. ప్రస్తుతం అక్కడ ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 14 లక్షల ఇరాన్ రియాల్స్‌‌కు పడిపోయింది. ఖమేనీ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 30కి పైగా నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

రెజా పహ్లావి పిలుపుతో భారీ నిరసన

ఇరాన్ చివరి రాజు కొడుకు రెజా పహ్లావి పిలుపు మేరకు ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఇంటర్​నెట్, ఇంటర్నేషనల్ టెలిఫోన్ సేవలను అధికారులు నిలిపివేశారు. 

గతంలో హిజాబ్ వ్యతిరేక పోరాటాలను అణచివేసిన ఆగ్రహం ఇంకా రగులుతూనే ఉందని నిరసనకారులు తెలిపారు. ఇప్పుడు దానికి ఆర్థిక కష్టాలు తోడయ్యాయని మండిపడ్డారు. డిసెంబర్​లో మొదలైన నిరసనలతో ఇప్పటి దాకా 45 మందికి పైగా చనిపోయారు, 2 వేల మందికి పైగా అరెస్ట్ అయ్యారని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.