ట్రంప్ సోలార్ షాక్: భారత సోలార్ ఎగుమతులపై 126% పన్ను.. బిజినెస్ కష్టమే..!

ట్రంప్ సోలార్ షాక్: భారత సోలార్ ఎగుమతులపై 126% పన్ను.. బిజినెస్ కష్టమే..!

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత సోలార్ ఇండస్ట్రీకి గట్టి షాక్ ఇచ్చింది. భారత్ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే సోలార్ ప్యానెల్స్‌పై ఏకంగా 126% ప్రాథమిక సుంకాలు విధిస్తూ అమెరికా వాణిజ్య శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోని ఎగుమతి ఆధారిత కంపెనీల వ్యాపారాలపై పెను ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ సర్కార్ 'బిగ్ షాక్'.. ఎందుకంటే?
భారతదేశం తన సోలార్ తయారీ రంగానికి అడ్డగోలుగా సబ్సిడీలు ఇస్తోందని.. దీనివల్ల అమెరికాలోని స్థానిక కంపెనీలు నష్టపోతున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. భారత్‌తో పాటు ఇండోనేషియా, లావోస్ దేశాలపై కూడా ఈ పన్నుల వేటు పడింది. అమెరికా దేశీయ మార్కెట్లో స్థానిక ఉత్పత్తుల ధరల కంటే తక్కువకు ఈ దేశాలు సోలార్ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ.

డేటా చెబుతున్న అసలు నిజం..
గత కొన్నేళ్లుగా అమెరికాకు సోలార్ మాడ్యూల్స్ సరఫరా చేయడంలో భారత్ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. 2024లో ఎగుమతుల విలువ సుమారు సుమారు రూ.6వేల 600 కోట్లకు చేరుకుంది. 2022తో పోలిస్తే ఇది 9 రెట్లు పెరగడం విశేషం. అలాగే 2025 మొదటి 6 నెలల కాలంలో అమెరికాకు అందిన సోలార్ దిగుమతుల్లో భారత్, ఇండోనేషియా, లావోస్‌ల వాటానే 57 శాతానికి చేరింది.

భారతీయ కంపెనీలకు ఇక కష్టమేనా..?
126 శాతం టారిఫ్ అంటే భారత సోలార్ తయారీదారులకు అమెరికా మార్కెట్ దాదాపు మూసుకుపోయినట్లేనని సిటీ అనలిస్ట్ విక్రమ్ బాగ్లీ అంటున్నారు. ఇంత భారీ పన్ను చెల్లించి అక్కడ పోటీ పడటం అసాధ్యం అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నెల మొదట్లోనే భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ.. సోలార్ ఉత్పత్తులపై ట్రంప్ తాజా నిర్ణయం రెండు దేశాల మధ్య ఆర్థిక ఉద్రిక్తతలను మళ్లీ పెంచింది.

ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికన్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ అలయన్స్ స్వాగతించింది. ఫెయిర్ కాంపిటీషన్ కోసం ఇదొక కీలక అడుగని వారు చెబుతున్నారు. అయితే.. ఒకవైపు గ్లోబల్ టారిఫ్స్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం, మరోవైపు ట్రంప్ మళ్లీ 10-15% టారిఫ్స్ విధిస్తానని బెదిరించడం వంటి పరిణామాలతో మార్కెట్లో అనిశ్చితి నెలకొంది. దీనివల్ల సోలార్ ప్రాజెక్టుల ఖర్చు పెరిగి.. చివరికి వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. అయినా ట్రంప్ మెుదటి నుంచి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగానే ఉన్నందున తాజా నిర్ణయం వచ్చి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 

దీనికి సంబంధించి తుది నిర్ణయం జులై 6న వెలువడనుంది. దీంతో పాటు 'యాంటీ డంపింగ్' డ్యూటీపై కూడా అమెరికా విచారణ చేస్తోంది. ఒకవేళ అది కూడా వ్యతిరేకంగా వస్తే భారత సోలార్ ఎగుమతులకు మరిన్ని అడ్డంకులు తప్పవు.