న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధిని కొనసాగిస్తోందని ఎస్‌బీఐ రిపోర్ట్ తెలిపింది. ప్రస్తుత 2026 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్ లో జీడీపీ వృద్ధి 8.1 శాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ డిమాండ్, స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలు దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తున్నాయి.
గ్రామీణ వినియోగం బలంగా ఉండటం, పట్టణ ప్రాంతాల్లో ఖర్చులు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలు. 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం జీడీపీ వృద్ధి 7.4 శాతం ఉంటుందని తొలి అంచనాలు వెల్లడించాయి. ప్రభుత్వం జీడీపీ ఆధారిత సంవత్సరాన్ని 2011-12 నుంచి 2022-23కు మార్చింది. కొత్త లెక్కలు ఈనెల 27న విడుదల కానున్నాయి. డిజిటల్ వాణిజ్యం, సర్వీస్ సెక్టార్ మార్పులను ప్రతిబింబించేలా ఈ సవరణలు చేశారు.
