అమెరికాలో మంచు తుఫాను బీభత్సం..కరెంటు లేక చీకట్లో 5.20 లక్షల ఇండ్లు

అమెరికాలో మంచు తుఫాను బీభత్సం..కరెంటు లేక చీకట్లో 5.20 లక్షల ఇండ్లు
  • 11 వేల విమాన సర్వీసులు రద్దు
  • కరెంటు లేక చీకట్లో 5.20 లక్షల ఇండ్లు
  • మరో రెండు రోజుల పాటు ఎఫెక్ట్
  • అమెరికాలో లక్షలాది ఇండ్లల్లో చీకట్లు

వాషింగ్టన్: ఈశాన్య అమెరికాను మంచుతుఫాను ముంచెత్తుతోంది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ తుఫాను సోమవారం కూడా ఈశాన్య అమెరికాలోని పలు రాష్ట్రాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. చాలా ప్రాంతాల్లోని రోడ్లపై అడుగుమేర మంచు కూరుకుపోయింది. అలాగే వాహనాలు, ఇండ్ల కిటికీలు, తలుపులు, పైకప్పులపైనా మంచు దుప్పటి కప్పేసింది. గడిచిన మూడు రోజుల్లో 11 వేల విమాన సర్వీసులను రద్దుచేశారు. మంచుతుఫాను కారణంగా వైర్లు తెగిపోవడంతో వివిధ రాష్ట్రాల్లో 5.20 లక్షల ఇండ్లు, ఆఫీసులకు కరెంటు సరఫరా నిలిచిపోయి చీకటి అలుముకుంది.

 వర్జీనియా నుంచి మసాచుసెట్స్  వరకు పవర్ లైన్స్  డ్యామేజ్ అయ్యాయి. ఒక్క మాసాచుసెట్స్ లోనే 2,82,024 ఇండ్లు, ఆఫీసులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. మసాచుసెట్స్​లోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన మంచు వల్ల వాహనాలు రోడ్లపై చిక్కుకున్నాయి. దీంతో మంచును క్లియర్  చేసే సిబ్బందికి సహాయక చర్యలు నిర్వహించడం అతికష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వేరే చోట్ల డ్రైవర్లు ఎవరూ రోడ్ల మీదకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్నోను తొలగించే సిబ్బందికి సహకరించాలని డ్రైవర్లను మసాచుసెట్స్  గవర్నర్  మౌరా హేలీ కోరారు. మాన్ హటన్ సెంట్రల్ పార్కులో 20 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. కాగా.. గురువారం వరకు మంచుతుఫాను కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

న్యూయార్క్​లో ఆంక్షల ఎత్తివేత

న్యూయార్క్  సిటీలోనూ మంచుతుఫాను ప్రభావం తీవ్రంగా ఉంది. రోడ్లపై మంచు కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో  న్యూయార్క్, బోస్టన్  మధ్య రవాణా ఆగిపోయింది. అయితే, సోమవారం న్యూయార్క్  సిటీలో మంచు ప్రభావం కాస్త తగ్గడంతో సహాయక పనులు ఊపందుకున్నాయి. రోడ్లపైకి ఎవరూ రాకూడదని అంతకుముందు విధించిన ఆంక్షలను న్యూయార్క్  సిటీ మేయర్  జోహ్రాన్  మమ్దానీ ఎత్తివేశారు. మంగళవారం సిటీ స్కూళ్లను రీఓపెన్  చేస్తామని తెలిపారు.