ఉత్కంఠ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం.. ఫిలిప్స్ బౌలింగ్ చేసిన 18వ ఓవర్.. న్యూజిలాండ్ కొంప ముంచింది !

 ఉత్కంఠ మ్యాచ్లో ఇంగ్లండ్ విజయం.. ఫిలిప్స్ బౌలింగ్ చేసిన 18వ ఓవర్.. న్యూజిలాండ్ కొంప ముంచింది !

కొలంబో: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లండ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్ను 6 వికెట్ల నష్టానికి 19.3 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు ఛేజ్ చేసింది. 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ విజయావకాశాలపై నమ్మకం సన్నగిల్లిన సమయంలో విల్ జాక్స్, రెహ్మాన్ అహ్మద్ నిలకడగా ఆడి ఇంగ్లండ్ జట్టును విజయ తీరాలకు చేర్చారు.

విల్ జాక్స్ 18 బంతుల్లో ఒక సిక్స్, 4 ఫోర్లతో 32 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, రెహ్మాన్ అహ్మద్ 7 బంతుల్లో 2 సిక్సులు, ఒక ఫోర్ కొట్టి 19 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ ఇద్దరి భాగస్వామ్యంతో ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్లో కివీస్ను ఓడించింది.

న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ విషయానికొస్తే.. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ చేసిన 18వ ఓవర్ న్యూజిలాండ్ జట్టుకు భారీ నష్టం మిగిల్చింది. 18వ ఓవర్లో 2వ బంతికి సిక్స్, 4వ బంతికి సిక్స్, 5వ బంతి ఫోర్, ఆరవ బంతి ఫోర్.. ఈ ఓవర్లో ఇవి గాక మరో రెండు పరుగులు రావడంతో 18వ ఓవర్లో ఇంగ్లండ్ బ్యాటర్లు 22 పరుగులు రాబట్టుకున్నారు.

19వ ఓవర్లో కూడా ఒ ఫోర్ ఒక సిక్స్ రావడం.. మిగిలిన నాలుగు బంతుల్లో 6 పరుగులు సాధించడంతో.. 19వ ఓవర్లో కూడా ఇంగ్లండ్ జట్టు 16 పరుగులు సాధించింది. 20వ ఓవర్లో 5 పరుగులు కొడితే ఇంగ్లండ్ విన్. ఆ పరిస్థితుల్లో రెండు బంతులకు రెండు సింగిల్స్, మూడో బంతికి ఫోర్ రావడంతో ఇంగ్లండ్ గెలిచింది. న్యూజిలాండ్ ఓడింది. 18, 19.. ఈ రెండు ఓవర్లు కలిపి 38 పరుగులు రావడంతో న్యూజిలాండ్ భారీ మూల్యం చెల్లించుకుంది.