జగిత్యాల జిల్లాలో ప్రేమ వివాహం ఉద్రిక్తతకు దారితీసింది. యువతి తరఫు బంధువులు యువకునిపై మూకుమ్మడిగా దాడిచేసి చితకబాదారు. రాళ్లు, కత్తులతో దాడి చేయటంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం జగిత్యాల సివిల్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల హౌసింగ్ బోర్డ్ కాలనీలో ప్రేమ వివాహం ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం (ఫిబ్రవరి 27) సఖి సెంటర్ లో అనిల్ కుమార్ పై యువతి బంధువులు రాళ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో అనిల్ కుమార్‌కు తల, చేయి, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ హాస్పిటల్ కి తరలించారు.
కరీంనగర్ చర్ల బూత్కూర్ కు చెందిన సౌమ్య , మల్యాల మండలం లంబాడిపల్లి కి చెందిన అనిల్ గత ఆరు నెలలుగా ప్రేమిచికుంటున్నారు. వారం రోజుల క్రితం వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనిల్ కు గతంలో వివాహం అయ్యిందనీ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని యువతి తరఫు బంధువుల చెబుతున్నారు. భార్య భర్తలు విడిపోయినట్లు తెలిపారు.
గత వారంలో అనిల్, సౌమ్య పెళ్లి చేసుకోగా.. పెద్దలు ఒప్పుకోకపోవడం తో మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐదు రోజులుగా సఖి సెంటర్‌లో యువతికి భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. అమ్మాయిని తీసుకెళ్లేందుకు అనిల్ కార్ లో వచ్చిన సమయంలో యువతి బంధువులు దాడి చేశారు. కులాంతర వివాహమే దాడికి కారణమని ఆరోపిస్తున్నారు.
