హైదరాబాద్: మియాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్ పేటలోని సర్వే నంబరు 44లో ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమ రిజిస్ర్టేషన్లతో పాటు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్కు గురైన నేపథ్యంలో హైడ్రా మరోసారి విచారణ చేపట్టింది.
ఈ మేరకు రంగంలోకి దిగిన హైడ్రా తప్పుడు పత్రాలతో 43 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు నిర్ధారించింది. ఈ క్రమంలో శనివారం (జనవరి 10) భారీ ఆపరేషన్ నిర్వహించిన హైడ్రా అధికారులు సర్వే నంబరు 44లో ఆక్రమణలకు గురైన 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా విలువైన భూమిని కబ్జాదారుల చెర నుంచి హైడ్రా విడిపించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
►ALSO READ | మాజీ ఐపీఎస్ భార్యకే సైబర్ నేరగాళ్ల వల.. ఇన్వెస్ట్మెంట్ పేరుతో రూ.2.58 కోట్లు కొట్టేశారు !
ఇదే సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి అవుతున్నట్టు హైడ్రాకు గతంలో కూడా ఫిర్యాదు అందింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు గతంలోనే 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు హైడ్రా అధికారులు. అలాగే మియాపూర్ - బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా ఉన్న చెరువు కట్టపై 200ల మీటర్ల మేర వేసిన 18 షెట్టర్లను గతంలోనే తొలగించారు. 159 సర్వే నంబర్‌లోని భూమి పత్రాలతో సర్వే నంబర్ 44లోని ప్రభుత్వ భూమిలో ఎకరన్నర వరకూ కబ్జా చేసిన ఇమ్రాన్ అనే వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేశారు అధికారులు.
