పూణే రియల్ ఎస్టేట్ బబుల్.. రూ.కోటి 80లక్షలు ఉన్న ఫ్లాట్ రెండు వారాల్లో రూ.2 కోట్లు అయ్యింది

పూణే రియల్ ఎస్టేట్ బబుల్.. రూ.కోటి 80లక్షలు ఉన్న ఫ్లాట్ రెండు వారాల్లో రూ.2 కోట్లు అయ్యింది

పూణేలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో పెరుగుతున్న రేట్లు, స్పీడు ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. కేవలం 15 రోజుల్లోనే ఒక ఫ్లాట్ ధర ఏకంగా రూ.20 లక్షల వరకు పెరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కునాల్ గాంధీ అనే నెటిజన్ ఎక్స్‌ వేదికగా పంచుకున్న తన అనుభవం మెట్రో నగరాల్లో రియల్ ఎస్టేట్ బబుల్ ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతోంది.

కునాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పూణేలో ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అయిన సమయంలో 3BHK ఫ్లాట్ కోసం వెళ్లినప్పుడు బిల్డర్ రూ. కోటి 80లక్షలు కోట్ చేశారని వెల్లడించారు. సరిగ్గా రెండు వారాల తర్వాత మళ్ళీ వెళ్తే.. అదే ఫ్లాట్ ధర రూ.కోటి 95లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. నిన్న మరోసారి వాకబు చేస్తే ఆ ధర రూ. 2 కోట్లకు చేరుకుందని.. వచ్చే నెలకల్లా అది రూ.2కోట్ల 15 లక్షలు అవుతుందని రియల్టర్లు చెబుతున్నట్లు తన ట్వీటులో వివరించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఇది నిజమైన డిమాండ్ వల్ల జరుగుతోందా లేక కృత్రిమంగా సృష్టించిన కొరత అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

చాలా మంది నెటిజన్లు బిల్డర్ల మాయాజాలాన్ని తప్పుపడుతున్నారు. కేవలం 80 శాతం ప్రాజెక్ట్ అమ్ముడైపోయిందని తప్పుడు ప్రచారం చేస్తూ.. లేని డిమాండ్ సృష్టించి రేట్లు పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు పెరగడం లేదు కానీ.. ఆస్తుల విలువ మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోందని, ఇది సామాన్యుడిని కోలుకోలేని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం అధిక జీతాలున్న వారి కొనుగోలు శక్తి పెరగడం వల్లే ఇలా ఎడాపెడా రేట్లు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పూణే రియల్ ఎస్టేట్ రేట్ల వేగం ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. 

►ALSO READ | శ్రీధర్ వెంబు విడాకుల కేసు.. భార్య ఆరోపణలు.. జోహో వెంబు వివరణ.. అసలేం జరుగుతోంది?