
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌పై దృష్టి పెట్టింది. చాలా కంపెనీలు దానిపై పనిచేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్ల ట్రయల్స్ కూడా మొదలయ్యాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద మందులపైనా ఫోకస్ పెట్టింది. వాటితో కరోనాకు చెక్ పెట్టొచ్చా అన్న కోణంలో పరీక్షలు చేయడానికి రెడీ అయింది. ఓ ఐదు మందులపై ట్రయల్స్ చేసేందుకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)తో జట్టు కట్టింది. అశ్వగంధ, తిప్పతీగ (గుడిచి), యస్తిమధు, పీప్లి అనే నాలుగు ఆయుర్వేద మూలికలతో పాటు ఇప్పటికే తయారు చేసిన ‘ఆయుష్64’ అనే మందుపై ట్రయల్స్ చేయనుంది.
50 లక్షల మంది మీద ట్రయల్స్
మొదటి దశలో ఆరోగ్య సేతు యాప్ గుర్తించిన రిస్క్ ఎక్కువున్న జోన్లలోని హెల్త్‌వర్కర్లపై కేంద్రం ఈ ట్రయల్స్ మొదలుపెట్టనుంది. అంతేగాకుండా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, పుణే సిటీల్లోని 50 లక్షల మందిపై ట్రయల్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు కరోనా రాకుండా అడ్డుకునే ఆయుర్వేద మందులపైనా స్టడీ చేయనుంది. కరోనా పేషెంట్లకు తొలి దశలో అశ్వగంధను ఇవ్వనున్నారు. ఆ తర్వాత పేషెంట్‌కు ఉండే లక్షణాల తీవ్రత, రోగి శరీరం స్పందించే తీరుకు తగ్గట్టు ఇతర మందులనూ ఇస్తారు.
పిప్పలి: ఘాటుగా ఉండే ఇది శ్వాస ఇన్ఫెక్షన్లు, బ్రాంకైటిస్, సర్ది, దగ్గు, ఆస్తమా వంటి వాటికి మంచి మందుగా పనిచేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను బాగు చేస్తుంది. ఇమ్యూనిటీని మరింత శక్తిమంతం చేస్తుంది. నొప్పులనూ తగ్గిస్తుంది. వాతానికి పనిచేస్తుంది.
అశ్వగంధ: నేటి కాలంలో దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతుంటారు. సర్ది, దగ్గు, ఇతర క్రిముల ఇన్ఫెక్షన్ నుంచి శరీరానికి రక్షణగా ఉంటుందీ ఆయుర్వేద మూలిక. సహజంగా మనకు ఇమ్యూనిటీ పెరగాలంటే రోజూ దానిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే ఒత్తిడి, అలసట వంటి వాటినీ ఇది తగ్గిస్తుందట. గుండెకూ మంచి చేస్తుంది.
తిప్పతీగ: దీన్ని మరణం లేని ఆయుర్వేద మూలిక అని పిలుస్తుంటారు. నొప్పులు, కేన్సర్, జ్వరానికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది. అంతేగాకుండా ఒంట్లో విష పదార్థాలు లేకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్‌గానూ, ఇమ్యూనిటీని పెంచే మందుగానూ పనిచేస్తుంది. శ్వాస, జీర్ణ సంబంధ సమస్యలకూ ఇది బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
ఆయుష్64: కేంద్ర ప్రభుత్వం ఈ మందును ప్రతిష్టాత్మకంగా తయారు చేయించింది. చాలా ఆయుర్వేద మూలికలన్నింటినీ కలిపి తయారైన మందు ఇది. మలేరియాను తగ్గించడంలో ఈ మందు బాగా పనిచేస్తున్నట్టు తేలింది. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు క్లోరోక్విన్ మందునూ ఇస్తుండడంతో దీనినీ ట్రయల్స్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
యస్తిమధు: ములేతి, లిక్కరైస్ అని పిలిచే తియ్యటి మూలిక ఇది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వాటికి మంచి ఔషధమిది. నొప్పులు, వాతం రాకుండా చూస్తుంది. గొంతు చికాకును తప్పిస్తుంది. పుండ్లు తగ్గించే గుణాలపైనా స్టడీస్ జరుగుతున్నాయి.